న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే వినియోగదారుల ఇంటి వద్దకే పార్సిల్ సేవలందించేందుకు ‘ఘర్ సే ఘర్ తక్’ పేరిట సరికొత్త డోర్ -టు- డోర్ సర్వీసును ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ సేవలను విస్తరించింది. ఈ విధానంలో వినియోగదారులు తమ పార్సిల్‌ను పంపడానికి రైల్వే లాజిస్టిక్స్ ఆఫీస్‌కి వెళ్లకుండా 'రైల్ పార్సిల్ యాప్' ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలు ఇంటి వద్ద పార్సిల్ సేకరించి, తమ లోకల్ లాజిస్టిక్స్ హబ్‌కు పంపుతాయి. అక్కడ పార్సిల్ బరువు, కొలతలు సరిచూసి, అవసరమైన బార్‌కోడింగ్, అదనపు ప్యాకింగ్, లేబులింగ్ పూర్తి చేస్తారు. సార్టింగ్ పూర్తయిన తర్వాత, ఆ పార్సిల్‌ను షెడ్యూల్ చేసిన రైలు బయలుదేరే స్టేషన్‌లోని రైల్వే పార్సిల్ ఆఫీస్‌కు తీసుకెళ్లి అధికారులకు అప్పగిస్తారు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ పాత్ర తాత్కాలికంగా ఆగుతుంది.
భారతీయ రైల్వే ఆ పార్సిల్‌ను నిర్దేశిత రైలు పార్సిల్ వ్యాన్‌లో లోడ్ చేసి గమ్యస్థాన స్టేషన్‌కు రవాణా చేస్తుంది. పార్సిల్ గమ్యస్థానానికి చేరుకోగానే, అక్కడి ప్రైవేట్ లాజిస్టిక్స్ భాగస్వామి రైల్వే పార్సిల్ ఆఫీస్ నుంచి దానిని రిసీవ్ చేసుకుంటారు. అక్కడినుంచి వారి లోకల్ డెలివరీ హబ్‌కు చేర్చి, చివరిగా లాస్ట్ మైల్ డెలివరీ చేపడతారు. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచి ఒక రోజు ముందు వరకు బుకింగ్ చేసుకోవచ్చు. పండుగల వేళ పార్సిల్ కోచ్‌ల రౌండ్- ట్రిప్ బుకింగ్‌లపై 25శాతం రాయితీ ఇస్తామని రైల్వే తెలిపింది.
