సింగరేణి ముంగిట్లోకి క్యాన్సర్ స్క్రీనింగ్

సింగరేణి ముంగిట్లోకి క్యాన్సర్ స్క్రీనింగ్
  • ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉచిత క్యాన్సర్ టెస్టులు 
  •     నాలుగు జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ 
  •     అనుమానిత కేసులను జిల్లా డే కేర్ సెంటర్లు, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్ కు రిఫర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బొగ్గు గని ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజల ముంగిట్లోనే ఉచిత క్యాన్సర్ టెస్టులు నిర్వహించేందుకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క మొబైల్ వాహనాన్ని మొత్తంగా 4 వెహికల్స్ ను కేటాయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తికాగా, త్వరలోనే ఈ స్పెషల్ మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ ఊరూరా పర్యటించి సేవలను ప్రారంభించనున్నాయి. 

కోల్ బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్యాన్సర్ పంజా

సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ గనుల నుంచి వెలువడే బొగ్గు ధూళి, సిలికా కణాలు, విద్యుత్ కేంద్రాల బూడిదతో గాలి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటికితోడు గని కార్మికులు, స్థానిక ప్రజల్లో పని ఒత్తిడి వల్ల బీడీలు, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉండడంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన లోపం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు ముదిరిపోయేదాకా బయటపడడం లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసుల  సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం గ్లోబల్ గా ప్రతి లక్ష  జనాభాకు 253 మందికి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, దేశంలో ఆ సంఖ్య ప్రతి లక్ష జనాభాకు 110గా ఉంది. ఇక రాష్ట్రంలో దేశ సగటుకంటే ఎక్కువగా ప్రతి లక్షకు 125 మందికి క్యాన్సర్ నమోదవుతున్నది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కేసులను గుర్తించి చికిత్సను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాహనంలోనే డిజిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే, మమోగ్రఫీ, ల్యాబ్ టెస్టులు 

గ్రామాలకు నేరుగా వచ్చే ఈ మొబైల్ స్క్రీనింగ్ వాహనాలు ఆధునిక సదుపాయాలున్న ఒక మినీ హాస్పిటల్ తరహాలో పనిచేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించేందుకు డిజిటల్ మమోగ్రఫీ మిషన్, మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మార్పులను పరిశీలించే కాల్పోస్కోప్, ప్యాప్ స్మియర్ కిట్లు, ఊపిరితిత్తుల కోసం డిజిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలు, ప్రాథమిక పాథాలజీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇందులో అమర్చనున్నట్లు తెలుస్తున్నది. ఈ వాహనాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో శిక్షణ పొందిన మెడికల్ ఆఫీసర్, రేడియాలజీ టెక్నీషియన్, మహిళా నర్సు, కౌన్సిలర్ ఉంటారు. వీరంతా స్థానిక ఆశా, ఏఎన్ఎంల సహకారంతో అనుమానిత లక్షణాలున్న వారికి అక్కడికక్కడే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు.

గ్రామాల నుంచి హైదరాబాద్ దాకా
మొబైల్ స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాన్సర్ లక్షణాలు బయటపడిన బాధితులను వెంటనే ప్రభుత్వ చికిత్సా వ్యవస్థతో అనుసంధానించనున్నారు. అనుమానిత రోగులను సమీపంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రులకు లేదా మెడికల్ కాలేజీలకు రిఫర్ చేసి బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. నిర్ధారణ అయిన వారికి ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చిన క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ద్వారా ఉచితంగా కీమోథెరపీ అందిస్తారు. మరింత సంక్లిష్టమైన పెద్ద శస్త్రచికిత్సలు, రేడియేషన్ థెరపీ అవసరమైన బాధితులను నేరుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్ హాస్పిటల్ లేదా నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేసి పూర్తి ఉచితంగా వైద్యం అందేలా చూస్తారు. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చివరి దశకు చేరిన తర్వాత కాకుండా, మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే రోగుల ప్రాణాపాయాన్ని పూర్తిగా తప్పించవచ్చన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ మొబైల్ స్క్రీనింగ్ సేవల పనితీరును బట్టి, తదుపరి దశలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ ఈ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.