ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను చాలా సింపుల్ గా మోసం చేసేస్తున్నారు. ఇందులో వారి తెలివితేటల కంటే కూడా మనం చేసే పొరపాట్లే ఇలాంటి వాటికి కారణంగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ పెరుగు ప్యాకెట్ డబ్బులు రీఫండ్ కోసం ప్రయత్నించి సైబర్ మోసగాళ్ల బారినపడింది. రూ.50 పెరుగు ప్యాకెట్ డబ్బుల కోసం చేసిన పనితో ఆమె రూ. 98వేలు కోల్పోయింది. ఆన్లైన్ సేవలను వినియోగించుకునేటప్పుడు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. అసలు ఏం జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఏం జరిగింది? మోసం ఎలా జరిగింది?
బెంగళూరులోని వసంత నగర్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ అక్టోబర్ 17న క్విక్ కామర్స్ యాప్ 'బ్లింకిట్' ద్వారా కొన్ని సరుకులు ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ అయిన వస్తువుల్లో పెరుగు ప్యాకెట్ చెడిపోయి ఉండటంతో.. దానికి రీఫండ్ పొందాలని అనుకున్నారు. దీనికోసం ఆమె గూగుల్ సెర్చ్‌లో బ్లింకిట్ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికారు.
గూగుల్ సెర్చ్‌లో లభించిన 2 నంబర్లలో ఒకదానికి ఆమె ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి తాను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌నని నమ్మబలికాడు. పాడైపోయిన పెరుగు ప్యాకెట్ ఫోటోను వాట్సాప్‌కు పంపాలని చెప్పి ఒక లింక్ పంపాడు. నిజమే అని భావించిన సదరు మహిళ ఆ లింక్ ద్వారా ఫోటోను అప్లోడ్ చేశారు. ఆ వెంటనే మరో వ్యక్తి ఫోన్ చేసి.. రీఫండ్ ప్రాసెస్ జరుగుతోందని చెప్పి ఆమెను గూగుల్ పే యాప్ చెక్ చేయమన్నాడు.
అదే సమయంలో ఆమె బాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.98వేలు డెబిట్ అయినట్లు గుర్తించి కంగుతిన్నారు. డబ్బు ఎలా మాయమైందనే పూర్తి వివరాలు స్పష్టంగా తెలియకపోయినా.. నకిలీ లింక్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు తస్కరిస్తున్నారు. బాధితురాలు అక్టోబర్ 23న సెంట్రల్ సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ సేవల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతికేటప్పుడు సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ప్రజలు కింది జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి:
1. ఆథరైజ్డ్ యాప్‌లనే వాడండి: గూగుల్ సెర్చ్‌లో కనిపించే నంబర్లను గుడ్డిగా నమ్మకండి. ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత సంస్థ అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే ఫిర్యాదు చేయాలి.
2. వాట్సాప్ లింక్‌లకు దూరం: రీఫండ్ ఇస్తామని చెప్పి తెలియని వ్యక్తులు వాట్సాప్‌లో పంపే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
3. యూపీఐ పిన్ ఇవ్వవద్దు: డబ్బులు మన ఖాతాలోకి రావడానికి (రీఫండ్ పొందడానికి) ఎప్పుడూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ కొట్టమంటే అది డబ్బులు రీఫండ్ పొందటం కాదు మోసగాళ్లకు మనం డబ్బులు పంపే ప్రక్రియ అని గమనించాలి.
4. వ్యక్తిగత వివరాలు గోప్యం: బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.
ఒకవేళ పొరపాటున ఎక్కడైనా సైబర్ మోసానికి గురైతే.. అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంకును సంప్రదించి అకౌంట్ బ్లాక్ చేయించాలి. అలాగే భారత్ ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. మీరు ఎంత త్వరగా రియాక్ట్ అయ్యి కంప్లెయింట్ పెడితే మీ డబ్బులు వెనక్కి రావటానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోండి.
