13 ఏళ్ల బాలికను ముద్దు పెట్టుకున్నాడని కొడుకుతో పాటు తండ్రిని నగ్నంగా ఊరేగించారు!

13 ఏళ్ల బాలికను ముద్దు పెట్టుకున్నాడని కొడుకుతో పాటు తండ్రిని నగ్నంగా ఊరేగించారు!

ఒక యువకుడు, అతని తండ్రి, స్నేహితుడికి కొందరు విధించిన శిక్ష సంచలనంగా మారింది. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి.. బట్టలు విప్పి తిరుగుతారా లేక షూట్ చేయాలా..? అంటూ బెదిరించడంతో పాపం అలాగే చేయాల్సి వచ్చింది. కోల్ కతాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోల్‌కతాలో ఒక 18 ఏళ్ల యువకుడు ఒక మైనర్ (13 ఏళ్లు) ని ముద్దు పెట్టుకోవటం  ఆమె కుటుంబ సభ్యులు చూశారు. దీంతో ఆ యువకుడితో పాటు  అతని తండ్రిని, స్నేహితుడిని కిడ్నాప్ చేసి దాడి చేసి, బందూక్ చూపించి నగ్నంగా నడిపించారు. ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి తల్లిదండ్రులు, మామను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఆదివారం (అక్టబర్ 27, 2026) ఆ 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలిసి ఆ మైనర్ ను కలుసుకున్నాడు.  వారు  ముద్దు పెట్టుకుంటుండగా చూసిన ఆ అమ్మాయి మామ..  ఆమె తండ్రికి, మరో మామకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి వచ్చి యువకుడు, స్నేహితుడిని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ దాడి చేసి, యువకుడిని తన తండ్రిని పిలవమని బలవంతం చేశారు.

తండ్రి వచ్చిన తర్వాత అతనిపై కూడా దాడి చేశారు. మీరు బట్టలు తీసి నడవకపోతే ముగ్గురినీ కాల్చేస్తాం అని బెదిరించారు. ఆ తర్వాత ముగ్గురినీ ఇంటి బయటి లేన్‌లో దాదాపు 50 మీటర్లు నగ్నంగా నడిపించారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద హత్యా ప్రయత్నం, ప్రమాదకర ఆయుధాలతో గాయాలు కలిగించడం, తప్పుడు నిర్బంధం, దుర్భాషలాడటం, బెదిరింపు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మాయి తండ్రి, తల్లి, మామను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగతావారిని  వెతుకుతున్నారు.

బాధితులకు వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు.  నిందితులు తుపాకీ దొరకకుండా దాచినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు తుపాకీ దొరకలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.