ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో మంజీరా నీళ్లకు కొరత ఏర్పడటంతో ఈ ప్రభావం బీరు కంపెనీలపై పడింది. మంజీరా నీటి సరఫరాలో కోత విధించే పరిస్థితులు ఉండటంతో.. సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లోని బ్రూవరీలు భూగర్భ జల వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో, ఫార్మాస్యూటికల్, ఇతర పరిశ్రమలు కూడా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. సంగారెడ్డి పట్టణ పరిసరాల్లోని బీర్ కంపెనీలకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులు మంజీరా నీటి సరఫరాను దాదాపుగా నిలిపివేశారు.
ఆ కంపెనీలు బీర్ల తయారీకి భూగర్భ జలాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఈ కారణంగా తెలంగాణలో ఇకపై విక్రయించే బీర్ల రుచి మారనుంది. మంజీరా నీరు బీరుకు రుచిని ఇస్తుంది. అందువల్ల.. తెలంగాణలోని ప్రధాన బ్రూవరీలు సంగారెడ్డి పట్టణంలో, పరిసర ప్రాంతాలలో తమ బీర్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. బీర్ల తయారీకి ఏడాది పొడవునా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లను వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇక బీరు కంపెనీలకే కాదు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందించే సింగూరు ప్రాజెక్ట్‌లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉండటంతో తాగు నీటి కష్టాలు తప్పేలా లేవు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది మీద నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.341 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి.
గతేడాది మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు, ఎగువన కర్నాటక నుంచి వరద రావడంతో సింగూర్ ప్రాజెక్టులోకి 20 టీఎంసీలకుపైగా నీరు చేరింది. అయితే ప్రాజెక్టు డ్యామ్ లో భద్రతా లోపాలు, అప్‌స్ట్రీమ్ స్లోప్ రెవెట్మెంట్ దెబ్బతినడంతో రిపేర్లు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. దీంతో సింగూర్ ప్రాజెక్టుకు రిపేర్లు చేపట్టాలని నిర్ణయించినఅధికారులు పనులకు ఆటంకం ఏర్పడకుండా నిల్వ ఉన్న నీటిని దిగువకు వదిలారు. దీంతో సింగూర్‌లో నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరుకుంది.
