కలియుగ వైకుంఠం తిరుమలలో రీల్స్ చేయడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని టీటీడీ హెచ్చరించింది కూడా. అయినప్పటికీ జనాల్లో మార్పు రావట్లేదు.. అడపాదడపా శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మరో జంట శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
శ్రీవారి ఆలయం ముందే కొందరు వ్యక్తులు పుష్ప 2 సినిమాలోని పాటకు రీల్స్ చేస్తూ హంగామా సృష్టించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయం ముందు రీల్స్ చేస్తున్న వారిని చూసి కూడా విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకుండా వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
►ALSO READ | తిరుమల దర్శనాల పేరుతో మరో స్కామ్.. ఈ వాట్సాప్ నెంబరుతో జాగ్రత్త!
రీల్స్ చేస్తున్న వ్యక్తులను గమనించినప్పటికీ విజిలెన్స్ సిబ్బంది వారిని అడ్డుకోకుండా వెళ్లిపోయారంటూ మండిపడుతున్నారు భక్తులు నెటిజన్లు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన సిబ్బంది ఇలాంటి చర్యలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో భక్తుల కదలికలపై నిఘా పెట్టే విజిలెన్స్ యంత్రాంగం.. ఆలయం ముందే రీల్స్ చేస్తుంటే ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిసరాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు. ఈ వివాదంపై టీటీడీ ఎలా స్పందిస్తుంది.. విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపడతారా లేదా.. రీల్స్ చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూడాలి.
