తిరుమల శ్రీవారి దర్శనం కోసం పరితపించే భక్తుల విశ్వాసాన్నే పెట్టుబడిగా చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నిర్వహిస్తూ భక్తులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని 2026 అక్టోబర్ 26న టీటీడీ సూచించింది.
సైబర్ నేరగాళ్లు 72090 03126 మొబైల్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వాట్సాప్ అకౌంట్ ద్వారా ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.
ఒక్కో టికెట్‌కు రెండు వేల రూపాయలు చెల్లించాలని.. అదీ కేవలం పది నిమిషాల్లోనే డబ్బులు పంపిస్తే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయని ఫోన్లు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. టికెట్లు అయిపోతాయనే ఆందోళన సృష్టించి భక్తుల నుంచి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అయితే శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్ల పేరుతో వచ్చే అనధికారిక సందేశాలను నమ్మవద్దని టీటీడీ ఇప్పటికే పలుమార్లు భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక బుకింగ్ మార్గాల ద్వారానే టికెట్లు పొందాలని.. గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపవద్దని సూచించింది.
ముఖ్యంగా వాట్సాప్ ద్వారా టికెట్లు కన్ఫర్మ్ చేస్తామంటూ వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. దర్శన టికెట్ల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలన టీటీడీ అధికారులు సూచించారు. అధికారికంగా నిర్ధారించుకోకుండా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు.
ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలను గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in
