ఏపీకి రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్లు!..నాలుగు ప్రాజెక్టులపై కేంద్రం సానుకూలం: ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీకి రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్లు!..నాలుగు ప్రాజెక్టులపై కేంద్రం సానుకూలం: ఏపీ సీఎం చంద్రబాబు
  •     విశాఖ–తిరుపతి మీదుగా బెంగళూరుకు స్లీపర్‌‌ వందే భారత్‌‌
  •     ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, వైష్ణవ్‌‌తో వేరువేరుగా భేటీ
  •     విజయవాడ, కొవ్వూరు, ఒంగోలు, అనకాపల్లి రైల్వే పనులపై చర్చ
  •     సెమీకండక్టర్‌‌, ఏఐ రంగాల అభివృద్ధికీ కేంద్రం సహకారం

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీలో రూ.10 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో ప్రతిపాదించిన 4 రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ బైపాస్‌‌, కొవ్వూరు–భద్రాచలం, ఒంగోలు–దొనకొండ, అనకాపల్లి–కొత్తవలస బైపాస్‌‌ ప్రాజెక్టులపై శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో ఆయన చర్చించారు. పెండింగ్‌‌లో ఉన్న పనులకు సంబంధించిన డీపీఆర్‌‌లను ఆమోదించి, నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బైపాస్‌‌కు రూ.3,197 కోట్లు, కొవ్వూరు–భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.2,860 కోట్లు, ఒంగోలు–దొనకొండ ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు, అనకాపల్లి–కొత్తవలస బైపాస్‌‌కు రూ.2,190 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు వివరించారు. 

విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు స్లీపర్‌‌ వందే భారత్‌‌ రైలును నడపాలని కోరగా, కేంద్ర మంత్రి అంగీకరించినట్లు సీఎంవో వెల్లడించింది. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌‌తో సమావేశమై రైల్వే ప్రాజెక్టులతోపాటు సెమీకండక్టర్‌‌, ఐటీ రంగాల అభివృద్ధిపై చర్చించారు. ఏపీని సెమీకండక్టర్‌‌ డిజైన్‌‌ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తుందని అశ్వినీ వైష్ణవ్‌‌ హామీ ఇచ్చారు. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, సామర్థ్యాల పెంపునకు మద్దతు అందిస్తామని తెలిపారు.