హైదరాబాద్, వెలుగు: ‘పార్టీ పదవుల్లో ఉండి పనిచేయనప్పుడు ఆ పోస్టులు మీకెందుకు? బాధ్యతలు నిర్వర్తించలేకపోతే పక్కకు తప్పుకొని పనిచేసేవాళ్లకు ఇచ్చేయండి’ అంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతల పనితీరుపై సునీల్ బన్సల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదని, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడాలని స్పష్టం చేశారు. పెద్దపెద్ద బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు దంచికొడితే వచ్చే ఇంపాక్ట్ కంటే.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, చిన్న సమూహాలతో కలిసి నలుగురితో కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుందన్నారు.
అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కనీసం రెండు, మూడు అయినా పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్గా చేయకపోతే ఎలాగని నేతలను నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు తమ సంస్థాగత పదవులకు రాజీనామా చేసి, నేరుగా నియోజకవర్గాల్లోకి వెళ్లి పనిచేసుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఇకపై తాను పూర్తి సమయం ఇక్కడే అందుబాటులో ఉంటానని, ఏ నాయకుడు ఏం పని చేస్తున్నాడనే దానిపై ప్రతి నెలా వర్క్ రిపోర్ట్ సమర్పించాల్సిందేనని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని నేతలకు బన్సల్ పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కదలాలని సూచించారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ‘లోక్తంత్ర బచావో - భీడ్తంత్ర హఠావో’ ఉద్యమంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ సహ ఇన్ఛార్జులు అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్.మధుకర్, సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి దశరథ్, తదితరులు పాల్గొన్నారు.
