- టీచర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నియామక ప్రక్రియ పూర్తయిన పది నెలల తర్వాత అధికారుల తప్పిదాన్ని సరిదిద్దే పేరుతో ఉద్యోగిని తొలగించడం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. తొలగించిన ఉపాధ్యాయురాలిని ఎనిమిది వారాల్లో తిరిగి విధుల్లోకి తీసుకోవడంతోపాటు, పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. 2024 డీఎస్సీలో 228వ ర్యాంకు సాధించిన సబావత్ వీణను ఎస్టీ కోటా కింద మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మోరంబావి తండా ఎంపీపీఎస్ పాఠశాలలో తెలుగు మీడియం ఎస్జీటీగా నియమించారు.
అయితే, అదే నోటిఫికేషన్లో 116వ ర్యాంకు సాధించిన డి. వినోద్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న కారణంతో ఆయన అభ్యర్థిత్వాన్ని తొలుత పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఆయనపై కేసులు కొట్టివేయడంతో, వినోద్‌కుమార్ పెట్టుకున్న వినతిపత్రం ఆధారంగా వీణను తొలగించి ఆయనను నియమించారని వివరించారు.
ఈ తొలగింపు ఉత్తర్వులను సవాలు చేస్తూ వీణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె. శరత్ ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వీణ నియామక ఉత్తర్వుల్లో నియామకం తాత్కాలికమని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే, వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అధికారుల పొరపాటేనని అంగీకరించారు.
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి.. క్రిమినల్ కేసులు ఉన్నాయన్న కారణంతో అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం సరైనది కాదని పలు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, అధికారుల తప్పిదానికి ఉపాధ్యాయురాలిని బాధ్యురాలిగా చేసి, పది నెలల తర్వాత ఆమె నియామకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే పది నెలలుగా విధుల్లో కొనసాగుతున్న వీణకు హక్కులు సంక్రమించాయని, ఆమెను తొలగించే ముందు నోటీసులు జారీ చేయకపోవడం, విచారణ నిర్వహించకపోవడం ఏకపక్ష చర్య అని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో వీణ ఎలాంటి తప్పు చేయలేదని, మోసానికి పాల్పడలేదని పేర్కొన్నారు. వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అధికారుల పొరపాటని, దాన్ని సరిదిద్దేందుకు అందుబాటులో ఉన్న ఖాళీలో ఆయనను నియమించవచ్చని లేదా అదనపు పోస్టును సృష్టించి కొనసాగించవచ్చని తెలిపారు. పిటిషనర్‌ను తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఆమె తొలగింపునకు సంబంధించి 2025 జులైలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఎనిమిది వారాల్లో వీణను తిరిగి విధుల్లోకి తీసుకొని పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఈ ఉత్తర్వులు వినోద్‌కుమార్ కొనసాగింపునకు అడ్డంకి కావని, ఖాళీ ఏర్పడే వరకు అదనపు పోస్టును సృష్టించి ఆయనను కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
