న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం, డాలర్ బలపడటంతో దేశీయంగా పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.1,900 తగ్గి రూ.1,46,100 వద్దకు చేరింది. కిలో వెండి ధర రూ.5,500 పతనమై రూ.2,02,000 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 30 నుంచి చూస్తే వెండి ధర ఏకంగా రూ.30 వేల వరకు తగ్గడం గమనార్హం.
పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం భయాలు పెరగడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరగడం విలువైన లోహాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, చాయిస్ బ్రోకింగ్ సంస్థల విశ్లేషకులు తెలిపారు. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం గరిష్ట స్థాయిలోనే ఉంటాయనే అంచనాలు కూడా ఈ పతనానికి కారణమయ్యాయి. గ్లోబల్గా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,024.37 డాలర్ల వద్ద స్థిరపడింది.
