అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు సంబంధించిన తాజా పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎనర్జీ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రాబోయే రోజుల్లోనూ బంగారం, వెండి ధరల్లో స్పష్టమైన దిశ కనిపించకపోవచ్చని ANZ అనలిస్ట్ సోని కుమారి అభిప్రాయపడ్డారు. అయితే తెలుగు ఆభరణాలు కొనాలనుకుంటున్న తెలుగు ప్రజలకు నిజంగా అందులోనూ మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్‌న్యూస్ అనే చెప్పుకోవాలి.
సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మే నెల తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. ఈ పరిణామాలు క్రూడ్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళనలను పెంచాయి. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ పెరగడం ఫెడరల్ రిజర్వ్ విధానాలపై ప్రభావం చూపుతోంది. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ అధికారులు త్వరలో నిర్ణయాలు తీసుకోనున్న తరుణంలో వడ్డీ ఆదాయం ఇవ్వలేని బంగారంపై ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే అవకాశం ఉంది.
డిసెంబర్లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో బంగారం ధరలపై మరింత భారం పడనుందని గోల్డ్‌మాన్ సాచ్స్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా ఆభరణాల డిమాండ్ పడిపోవడం కూడా బంగారం ధరల పతనానికి మరో కారణంగా నిలుస్తోంది. రాబోయే 6 నెలల పాటు ఔన్సు బంగారం సగటున 4,200 డాల్టర్ల వద్ద ట్రేడ్ కావచ్చునని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అక్టోబర్ 29న విడుదల కానున్న అమెరికా వ్యక్తిగత వినియోగ వ్యయం డేటా రిపోర్ట్ వడ్డీ రేట్ల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానుంది.
సాధారణంగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారానికి, వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆకర్షణ తగ్గుతోంది. ద్రవ్యోల్బణం ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పసిడి, వెండి ధరలలో అస్థిరత అలాగే కొనసాగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ ధరలకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమే అయినప్పటికీ.. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి పెట్టుబడులు పెట్టడం మంచిదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
