మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘిస్తున్న సంస్థలపై FDA అధికారులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ప్రముఖ పిజ్జా చైన్ డొమినోస్‌తో సహా మొత్తం 11 ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన దాదాపు 38 టన్నుల కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన ఈ ఆహార పదార్థాల విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని అంచనా.
అక్టోబర్ 21, 22 తేదీలలో ఎఫ్‌డీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వంటగదులు చాలా అపరిశుభ్రంగా ఉండటం, మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, తుప్పుపట్టిన రాక్టన్లు, పాత్రలు వాడటం, ఆహారం తయారు చేసే సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి అనేక ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల తిరిగి వెనక్కి వచ్చిన పాత బ్రెడ్‌ను తాజా స్టాక్‌తో కలిపేయటం, స్వీట్లలో అనుమతి లేని రంగులను వాడుతున్నట్లు తేలింది.
ALSO READ : డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు
ఈ తనిఖీల్లో భాగంగానే ముంబైలోని భాండుప్ వెస్ట్, అలాగే బీడ్‌లో ఉన్న ప్రముఖ డొమినోస్ పిజ్జా ఔట్లెట్ల లైసెన్సులను అధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. ముంబైలోని మజ్గావ్‌లో ఉన్న ఎస్కే బేకరీ, గ్రాంట్ రోడ్డులోని నెఖ్‌జాద్ రెస్టారెంట్, బాంద్రా వెస్ట్‌లోని ఫుడీస్ మల్టీ క్యూసిన్, జోగేశ్వరి వెస్ట్‌లోని అరేబియన్ లుక్మా, కుర్లా వెస్ట్‌లోని ఢిల్లీ జైకా, ఘాట్‌కోపర్ వెస్ట్‌లోని యూ-మీ, గోవాండిలోని బిక్కగ్రే బిర్యానీతో పాటు పర్భణీలోని కేకే బేకరీలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్నే ప్రాథమికంగా భావిస్తూ ఎఫ్‌డీఏ చేపట్టిన ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్న వారిలో వణికిస్తున్నాయి.
