అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఈబే తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన ఆపరేషన్స్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది ఈ ఏడాదిలో కంపెనీ చేపడుతున్న రెండో విడత లేఆఫ్స్.
తాజా లేఆఫ్స్ ద్వారా కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 9 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. గత ఏడాది చివరి నాటికి ఈబే సంస్థలో దాదాపు 12వేల 300 మంది ఉద్యోగులు పనిచేశారు. అయితే ఏయే విభాగాలు, ఏ ప్రాంతాల ఉద్యోగులు ఈ లేఆఫ్స్ బారిన పడతారనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులకు రాబోయే రోజుల్లో సమాచారం అందిస్తామని సీఈఓ జామీ ఇయన్నోన్ తన ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు.
లేఆఫ్స్‌కు అసలు కారణం ఏమిటి?
మేనేజ్మెంట్ లెవెల్స్ సరళీకృతం చేయటం, అత్యధిక వృద్ధి అవకాశాలున్న రంగాలపై పెట్టుబడులు పెట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా లగ్జరీ గూడ్స్, కలెక్టిబుల్స్, రీఫర్బిష్డ్ ఉత్పత్తుల వంటి స్పెషలైజ్డ్ షాపింగ్ కేటగిరీలపై ఈబే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
ALSO READ : eMudhra అంటే ఏంటి..?
కొత్త వ్యూహాలు.. సవాళ్లు:
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈబే సుమారు 800 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకునేందుకు సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ 'డిపాప్'ను రూ.లక్షా 30వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే గతేడాది మే నెలలో గేమ్‌స్టాప్ సీఈఓ రియాన్ కోహెన్ ఈబేను కొనుగోలు చేసేందుకు 56 బిలియన్ డాలర్ల భారీ ప్రతిపాదన తెచ్చినప్పటికీ.. అది ఆకర్షణీయంగా లేదంటూ ఈబే తిరస్కరించింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మారుస్తూ ఈబే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
