తెలంగాణలో సన్న బియ్యం ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం రేట్లు మరింత భారంగా మారాయి. బహిరంగ మార్కెట్లో సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో ధర రూ.90 నుంచి రూ.95 వరకు చేరగా.. సూపర్ ఫైన్ మీడియం రకం రూ.85 నుంచి రూ.90. ఫైన్ రకం రూ.78 నుంచి రూ.80 వరకు పలుకుతున్నది. ధరలు ఇలాగే పెరిగితే సన్న బియ్యం కిలో ధర సెంచరీకి చేరడానికి ఎంతో దూరంలో లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
సన్నబియ్యం ధరలు గత వారం రోజులుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో 26కిలోల శ్రీలలిత HMT రైస్ బ్యాగ్ 2351 రూపాయలుగా ఉంది. మహీంద్ర Cow Hmt రైస్ 26 కిలోల బ్యాగ్ 1977 రూపాయలు ఉంది. గజరాజజ్ సోనా మసూరి రైస్ 1890 రూపాయలుగా ఉంది.
హోల్ సేల్ మార్కెట్లోనూ క్వింటాల్ బియ్యంపై సుమారు రూ.1,200 వరకు పెరుగుదల కనిపిస్తున్నది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆ ర్ (తెలంగాణ సోనా) వంటి సన్నరకాలతో పాటు ప్రీమియం రకాల ధరలు ఎగబాకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం ఫైన్ రకం బియ్యం కిలో రూ.80కి పైగా ధరలు వరకు అమ్ముతున్న ట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
బియ్యం ధరల పెరుగుదలకు వ్యాపారులు ఎలినినో ప్రభావం, వర్షపాతం లోటు, సాగునీటి కొరత, పరిసాగుపై అనిశ్చితి కారణాలుగా చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారం ధరలపై ప్రభావం చూపుతున్నది. మరోవైపు.. పాత ధాన్యం నిల్వలు తగ్గడం, కొత్త ధాన్యం పూర్తిగా మార్కెట్ కు చేరకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణం అంటున్నారు.
ALSO READ : కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరిపించండి
కొత్త ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన వెంటనే సరఫరా చేయకపోవడంతో వ్యాపారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, బియ్యం నిల్వలను పెంచుకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. మూడు నెలల్లోనే క్వింటాల్‌పై దాదాపు రూ.3 వేల వరకు పెరిగింది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎస్ఆర్ వంటి రకాల ధరలు భారీగా పెరిగాయి. జూన్‌లో క్వింటాల్ రూ.4,600 నుంచి రూ.5,500 మధ్య ఉన్న కొన్ని రకాల ధరలు ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతున్నాయి. కొన్ని ప్రీమియం రకాల ధరలు రూ.9 వేల మార్కును దాటాయి.
