మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖకు లేఖ రాశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొండ పోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖా కార్యదర్శి శ్రీధర్ కు 2026 అక్టోబర్ 22న రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రజల అవసరాల కోసం ఉపయోగించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను వ్యక్తిగత అవసరాల కోసం ఫామ్ హౌస్ కు వాడుకోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రాజెక్టు రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ప్రజా ధనం ఎంత దుర్వినియోగం అయిందో లెక్క బయటకు వస్తుందని పేర్కొన్నారు.
కొండ పోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తరలింపుపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, భాద్యులలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించి పాండవుల రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే 58 ఎకరాల్లో పాండురంగ చెరువు తవ్వించారని, 2016కు ముందు అక్కడ ఎలాంటి చెరువు లేదని ఇప్పటికే ఎంపీ చామల గుర్తు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ : భూభారతి రీ సర్వేపై ఎర్రవల్లి గ్రామస్తుల అభ్యంతరం..
2017లో దీన్ని పూర్తిచేశాక కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు మళ్లించి, నింపుకుంటున్నారని విమర్శలున్నాయి. ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని 3 ఎకరాల బావికి పంప్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఇటీవలే ఆరోపించారు.
రైతుల పేరుతో రూ.45 కోట్ల 54 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారని, ఇది కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పరాకష్టగా ఎంపీ చామల అభివర్ణించారు.
