దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు.. ఎలాంటి తప్పులకు, మోసాలకు తావులేకుండా రూల్స్ తీసుకొస్తోంది. భారతీయులకు అలాగే విదేశీయులకు వేర్వేరు రంగులతో కూడిన డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రంగుల ఆధారంగా గుర్తింపు..
ఇప్పటివరకు దేశంలో ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఒకే రంగులో ఉండేది. కానీ ఇకపై మన దేశ పౌరులకు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేసే విదేశీయులకు మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా విభిన్న రంగుల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ఎవరు ఏ దేశానికి చెందినవారనేది లైసెన్స్ చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపై హోల్డర్ బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను ముద్రించడం తప్పనిసరి చేయనున్నారు.
గతంలో వయసు, అడ్రస్ రుజువు కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ వద్ద సంతకం చేసిన సాధారణ అఫిడవిట్లను ఆమోదించేవారు. అయితే చాలామంది తప్పుడు అడ్రసులు, తప్పుడు పుట్టిన తేదీలతో నకిలీ అఫిడవిట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో మోసాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి అఫిడవిట్ల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇకపై లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా వయసు, అడ్రస్ ప్రూఫ్‌గా అంగీకరించబోమని స్పష్టం చేసింది. కేవలం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లులు వంటి వెరిఫై చేయదగిన పత్రాలను మాత్రమే అనుమతిస్తారు.
ఆన్లైన్ సేవలు మరింత సులువు..
ప్రజలకు ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఆధార్ అథెంటికేషన్ ద్వారా అడ్రస్, పేరు లేదా ఫోన్ నంబర్ మార్చుకునే వారికి సంబంధిత ఫీజులను పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆన్లైన్ సేఫ్-డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షను మరింత కఠినతరం చేశారు. ఇప్పటివరకు ఉన్న 60% పాస్ మార్కును ఏకంగా 75%కి పెంచారు. ఈ లెర్నింగ్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు చూడాల్సి ఉంటుంది.
ALSO READ : అమెరికన్ల ప్రయోజనాలే మాకు ముఖ్యం..
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వివరాల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అధికారులు ఆమోదించడం లేదా రిజెక్ట్ చేయటాన్ని పూర్తి చేయాలి. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 30 రోజులు దాటితే.. ఆ దరఖాస్తు ఆటోమెటిక్ గా ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుంది. సో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నం దళారుల బెడద నుంచి కొంత రిలీఫ్ ఇస్తుందని వాహనదారులు అంటున్నారు.
