హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన బీట్ఆఫీసర్ (ఎఫ్‌బీవో) బానోతు నవీన్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డును ప్రకటించింది. వన్యప్రాణుల రక్షణ, వేట నిరోధంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఫ్రంట్‌లైన్ స్టాఫ్ – ప్రొటెక్షన్ అండ్ యాంటీ-పోచింగ్ విభాగంలో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా అటవీ, వన్యప్రాణి సంరక్షణలో అసాధారణ సేవలందించిన క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక కమ్యూనిటీల నుంచి కేంద్రం నామినేషన్లను ఆహ్వానించింది. నిపుణుల సెలక్షన్ కమిటీ పరిశీలన అనంతరం 3 విభాగాల్లో మొత్తం 8 మంది అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. ఇందులో రక్షణ, వేట నిరోధక విభాగంలో తెలంగాణ నుంచి నవీన్ పేరును కేంద్రం ఖరారు చేసింది. త్వరలోనే ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు.
