విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. 99 పట్టణ, నగర సంస్థలకు నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న ఫలితాలను వెల్లడిస్తారు. మైదుకూరు పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించలేదు. మైదుకూరులో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ, తర్వాతే పోలింగ్ జరిగే అవకాశం ఉంది.
ఏపీలోని 100 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాల ప్రకటనను 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తొలుత 19 ప్రాంతాల్లోనే ఎన్నికలు ఆపాలని భావించినప్పటికీ.. ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలన్న వైసీపీ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. 19 చోట్ల తమను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆ పార్టీ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నామినేషన్ల గడువు వాయిదాకు, పొడిగింపునకు నిరాకరించింది.
ALSO READ : 25 కేజీల HMT రైస్ బ్యాగ్ కొంటున్నారా..?
నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఫిర్యాదు చేసిన చోటే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 27న నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. 100 చోట్ల ఎన్నికల ప్రక్రియను నిలిపి వేస్తూ.. నవంబర్ 1కి మున్సిపల్ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
