హైదరాబాద్: ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి యువకుడి వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన 23 ఏళ్ల గండమళ్ల చందన మేడిపల్లిలోని ఓ కంటి ఆసుపత్రిలో పనిచేస్తోంది.
గత ఏడాదిన్నరగా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ అనే యువకుడితో ఆమె ప్రేమ సంబంధంలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో శివ తన కుమార్తెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని చందన తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఆరోపించారు. వేధింపులు భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని చందన తన అక్కతో చెప్పినట్లు తెలిపారు.ఈ క్రమంలో అక్టోబర్ 22న చందన ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కుమార్తె మృతికి శివ వేధింపులే కారణమని ఆరోపిస్తూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. రామంతాపూర్‌లో యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
