మనం గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాం. లేదంటే ఫ్యూచర్‌ని తలుచుకొని భయపడుతుంటాం. అంతేగానీ, ప్రస్తుతం ఏం చేస్తున్నాం? ఆ చేస్తున్న పని మీద ఫోకస్ పెడుతున్నామా? అని మాత్రం ఆలోచించం. ప్రజెంట్ స్టేట్ లో ఉండటం అంత ఈజీ కాదు. కానీ, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్ ద్వారా ఇది సాధ్యమే! ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న టెక్నిక్స్ లో మైండ్ ఫుల్నెస్ కూడా ఒకటి. ఇది మనసుపై ఎలా పని చేస్తుంది?
మనసు చంచలమైనది. అందుకే ఆది ఒకచోట ఉండదు. ఆకాశంలో మబ్బుల్లాగా..ఎటు గాలొస్తే అటు ఆలోచనలు కూడా దారి తప్పి ఎగిరిపోతుంటాయి. ఊయల్లాగ ఊగే మనసుని ఒక చోట ఆపి ఉంచడం మాటలతో చెప్పినంత ఈజీకాదు. అయితే, ఆలోచనల్ని ఎందుకు కంట్రోల్ చేయాలి? వాటంతట వాటిని వదిలేయాలి అనేవాళ్లు కూడా ఉంటారు.
అయితే, ఆలోచనల్ని ప్రజెంట్ స్టేట్ లో ఉంచలేనివాళ్లు గతంలో బతుకుతూ బాధపడటమో, ప్యూచర్ లో ఉండి భయపడటమో చేస్తుంటారు. దీని వల్ల ప్రజెంట్ స్టేట్ లో చేసే పని మీద, ఆలోచిస్తున్న విషయం మీద ఫోకస్ పెట్టలేకపోతారు. మనం ఏం చేస్తున్నా.. క్షణం క్షణం మనసు అదుపు తప్పి పోతుంటుంది. ఇదే యాంగ్జెటీ! చివరికి దీని తాలూకు నష్టం భరించాల్సింది కూడా మనమే!
మైండ్ ఫుల్నెస్ అంటే?
మైండ్ ఫుల్నెస్ అంటే.. చాలా సింపుల్ పదం. చదవగానే ఇది మైండ్ కి సంబంధించినదని ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తున్నాం? మనం ఉన్న ప్లేస్ లోనే మన మనసు కూడా ఉందా? అనే అవేర్ నెస్ కలిగి ఉండటం అన్నమాట. ఇలా వందశాతం ప్రజెంట్ మూమెంట్ ఆలోచనల్ని ఉంచగల కెపాసిటీనే మైండ్ ఫుల్నెస్ . ఇది మెడిటేషన్ లో ఒక భాగం!
మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? మన చుట్టూ ఏం జరుగుతుంది? దానికి మనం ఎలా
రియాక్ట్ అవుతున్నాం? లాంటి వాటి మీద సోయి కోల్పోకుండా ఉండటం కూడా మైండ్ ఫుల్నెస్ అని చెప్పొచ్చు.
అందరికీ ఉంటుంది
మన ఆలోచన ఎంత దూరం వెళ్లినా... తిరిగి మనం ఏం చేస్తున్నామో అక్కడికి తీసుకురాగల కెపాసిటీ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంటే మైండ్ ఫుల్నెస్ సహజంగానే ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అయితే, దానికి ఎలా యాక్సెస్ ఇవ్వాలో చాలామందికి తెలియదు.
మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటో కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి అనుకుంటే.. దాని గురించి కేవలం పేపర్ లో , వెబ్ సైట్స్ లో, పుస్తకాల్లో చదివి వదిలేయకుండా కొన్నాళ్లు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. ఇది మెడిటేషన్ లో భాగమే అయినా.. కూర్చొని, నడుస్తూ, నిలబడి, ప్రయాణం చేస్తూ, పని చేస్తూ.. ఇలా ఎలాగైనా, ఎప్పుడైనా మైండ్ ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేయొచ్చు.
ALSO READ : ఇంట్లో పిల్లలకు లెక్కలు ఇలా నేర్పండి..
ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు నిద్రలోకి జారుకునే అవకాశం కూడా ఉంది. అంటే మెడిటేషన్ , స్పోర్ట్స్, యోగ లాంటి యాక్టివిటీస్ తో కలిపి ప్రాక్టీస్ చేస్తే బెటర్. లేదంటే వర్క్ ప్లేస్‌లో బ్రేక్ టైమ్‌లోనో, జర్నీ చేస్తున్నప్పుడో దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు.
మెడిటేషన్ కష్టమా?
మెడిటేషన్ అనగానే అది రుషులు. గురువులు, చేసేది. మనం చేయంలేం అనుకునేవాళ్లే ఎక్కువ. కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు అది మెడిటేషన్ అయిపోదు. ఇలా కళ్లు మూసుకొని ప్రయత్నించి మనవల్ల కాదు అని మళ్లీ ధ్యానం వైపే చూడరు.. ధ్యానం చేయడానికి ప్రయత్నించిన వాళ్లలో ఎక్కువమంది అది కష్టమనీ, అసాధ్యమనీ అనుకోవడానికి కారణం వాళ్లు అది చేయడానికి సరిగ్గా ప్రయత్నించకపోవడమే.
నిజానికి మెడిటేషన్ ఒక పని కాదు. అదొక అనుభూతి. శరీరాన్ని, మనసును, ఎమోషన్స్ ని, శక్తులను ఒక్క తాటి మీదకు తీసుకెళ్తేనే సాధ్యమవుతుంది. ఇది నేలను సారవంతం చేయడం లాంటిది. అవసరమైన ఎరువులు, నీళ్లు ఇచ్చి మంచి విత్తనం నాటితే... చెట్టు అవుతుంది.
అది పూలూ, పండ్లను ఇస్తుంది. కానీ, కేవలం కోరుకున్నంత మాత్రాన పూలూ, పండ్లు రావు. అవి రావడానికి అవసరమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తేనే సాధ్యం! అచ్చంగా ఇలాగే, మన అంతర ప్రపంచంలో అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే మనం ఎవరు? ఏం చేస్తున్నాం? అని అర్థమవుతుంది.
ఎలా చేయాలి?
ఎక్కడైనా సరే కంఫర్ట్ గా కూర్చోవాలి. పాదం కచ్చితంగా ఫ్లోర్ ని తాకేలా చూసుకోవాలి. తర్వాత శరీరంలో కింది నుంచి పై వరకు ప్రతి అవయవం లేదా శరీరభాగం మీద ఫోకస్ పెడుతూ తల వరకూ రావాలి. అలా అన్ని శరీర భాగాలు రిలాక్స్ అయిన తర్వాత.. శ్వాస మీద లేదా హృదయం మీద ధ్యాస పెట్టాలి.
హృదయం మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు పరుగులు తీయడం గమనిస్తారు. అయితే, ఆ ఆలోచనల్ని పట్టించుకోకుండా హృదయం మీద ధ్యాస మళ్లించాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్నాళ్లకు ప్రజెంట్ స్టేట్‌లో జీవించగల శక్తి వస్తుంది.
ప్రాక్టీస్‌తో లాభాలు
మైండ్ ఫుల్నెస్ ఎవరైనా చేయొచ్చు. ఇది యూనివర్సల్ క్వాలిటీస్ ను డెవలప్ చేస్తుంది. దీనికోసం ఎవరూ తమ తమ నమ్మకాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనిని నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అయితే, మెడిటేషన్ చేసినప్పుడే ఇది అర్ధమవుతుంది.
మనం మెండ్ ఫుల్ స్టేట్ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. పనితీరు మెరుగవుతుంది. చేసే పని, సోకగా చేయగలుతాం. మన అంతర్ ప్రపంచాన్ని చూడగలుగుతాం. స్వార్ధంగా ఆలోచించడం నుంచి ఇతరుల శ్రేయస్సుపై దృష్టిపెడతాం.
ఇతరులను జడ్జ్ చేయడం మానేస్తాం చేయాల్సిన పని మీద ఉత్సాహం పెరుగుతుంది. అలాగే మైండ్ ఫుల్నెస్ వల్ల ప్రతి మనిషితో కరుణతో, దయతో మెలుగుతాం. ఆరోగ్యం, ఆనందం, పని, రిలేషన్ షిప్స్ అన్నింటిపై.. మైండ్ ఫుల్ నెస్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. బిజీ, రఫ్ స్టైల్‌కి అవసరమైన మెడిసిన్ ఇదే కదా!
