నిజాలు తెలుసుకోండి హిందువులారా.. ఓట్ల చోరీ, మత రాజకీయాలతోనే బీజేపీ అధికారంలోకి: నటుడు కిషోర్

నిజాలు తెలుసుకోండి హిందువులారా.. ఓట్ల చోరీ, మత రాజకీయాలతోనే బీజేపీ అధికారంలోకి: నటుడు కిషోర్

దేశంలో ప్రస్తుత పరిణామాలు, మత రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దుర్వినియోగంపై ప్రముఖ నటుడు కిషోర్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దేశంలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా తప్పుపడుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతాల పేరుతో బీజేపీ ప్రజలను విడదీసి రాజకీయ పబ్బం గడుపుతున్న తీరును ఎత్తిచూపారు.

ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, పరిణామాలను ఉదాహరణగా చూపుతూ.. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ రైట్-వింగ్ అల్గారిథమ్స్, మతతత్వ భావజాలం నుంచి బయటకు వచ్చి అసలు నిజాలు ఏమిటో తెలుసుకోవాలని కిషోర్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు జరుగుతున్న తీరును ఖండించారు. గుజరాత్ అల్లర్ల నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. నాటి మోడీ-షా మోడస్ కుట్రలే ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసం, కుర్చీని కాపాడుకోవడం కోసం పాలకుల విధానాలు ఏ స్థాయికి దిగజారాయో ఆయన విమర్శించారు. మతాన్ని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, రామమందిరం పేరుతో సాగిన రాజకీయాలు ఇప్పుడు ప్రజలకు స్పష్టమవుతున్నాయని పేర్కొన్నారు. ఏ పనులూ చేయకుండా కేవలం ద్వేషాన్ని, మతాన్ని నమ్ముకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బై హుక్ ఆర్ క్రుక్ పద్ధతిలో ఎన్నికలను ప్రభావితం చేయడం, వ్యవస్థలను గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారానే అధికారంలో కొనసాగుతున్నారని ఆరోపించారు.

ఓట్ల చోరీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు వంటి అక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత రక్షణ ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ నాటకాలను హిందువులు గమనించాలని, దేశం కంటే మత రాజకీయాలు గొప్పవి కావని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ నడయాడిన ఈ పవిత్ర భూమిని గాడ్సే భావజాలంతో నడిపించే శక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావునివ్వబోమని తేల్చిచెప్పారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ పొలిటికల్ కుట్రలపై నటుడు చేసిన వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.