వరుణ దేవుడు కరుణిస్తున్నాడు.. ఎల్ నినో ఎఫెక్ట్ తో నీటి కష్టాలు పడుతున్న జనానికి రిలీఫ్ ఇవ్వబోతున్నాడు. అవును.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చేసింది. నిన్నా మొన్నటి వరకు అంచనా మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాయుగుండం ఏర్పడనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ 2026, అక్టోబర్ 23వ తేదీన ప్రకటన విడుదల చేసింది.
ఆగ్రేయం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్ 25వ తేదీ నాటికి ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో వచ్చే సోమవారం అంటే.. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేస్తోంది వాతావరణ శాఖ రిపోర్ట్. అక్టోబర్ 23వ తేదీ నుంచే అంటే.. శుక్రవారం నుంచే రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు చెప్పిన వాతావరణ శాఖ.. అక్టోబర్ 25వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 25వ తేదీ తర్వాత ఈ వాయుగుండం మరింత బలపడి.. తుఫాన్ గా మారే అవకాశం ఉందని.. ఇది కోస్తా ఆంధ్ర వైపు పయనిస్తూ.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాయుగుండం బలపడి.. తీరం దాటే సమయంలో కోస్తాంధ్రాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయుగుండం బలపడిన తర్వాత ఏపీలో తీరం వెంట 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది వాతావరణ శాఖ.
తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావంతో కరువు ఏర్పడింది. ఇలాంటి సమయంలో అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుండటంతో రైతులు, జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. వర్షాలు బాగా పడితే నీటి కష్టాలు తప్పుతాయని ఆశిస్తున్నారు.
