అమెరికన్ల ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ఇండియా కోసం రూల్స్ మార్చలే: మార్కో రూబియో

అమెరికన్ల ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ఇండియా కోసం రూల్స్ మార్చలే: మార్కో రూబియో

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అమెరికాలో ఇటీవల మారుతున్న వర్క్ వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల గురించి వస్తున్న ఆందోళనలను తోసిపుచ్చారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కాదని.. ఇవి ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీంతో ఇండియానే టార్గెట్ చేసి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చుతున్నారు, టైట్ చేస్తున్నారనే ప్రచారానికి తెరపడింది.

అమెరికా ఎప్పుడూ తన దేశ కార్మికులకు, జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రూబియో చెప్పారు. "భారత ప్రభుత్వం కూడా ఎప్పుడూ తన దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తుందని నేను భావిస్తున్నాను. అదే విధంగా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కూడా మా ప్రజలను, మా కార్మికులను, మా దేశాన్ని మొదట ఉంచుతుంది" అని రూబియో స్పష్టం చేశారు. భారత్‌ను టార్గెట్ చేసి నిబంధనలు మార్చలేదని.. ఇది పూర్తిగా గ్లోబల్ పాలసీ అని క్లారిటీ ఇచ్చారు.

గతంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అనేక లోపాలు ఉండేవని, బిజినెస్-సంబంధిత ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌లలో మోసాలు, దుర్వినియోగాలు విపరీతంగా జరిగాయని రూబియో గుర్తుచేశారు. ఈ సమస్యలను పరిష్కరించడానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9న కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలను కూడా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్(గ్రీన్ కార్డ్) నుంచి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కంపెనీలపై ఫెడరల్ దర్యాప్తులు జరుగుతున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

అంతేకాకుండా ఎఫ్‌-1 స్టూడెంట్స్ OPTపై కూడా కొత్త ఫీజులను ప్రతిపాదించారు. అమెరికన్ కార్మికులను రక్షించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.

అయితే నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలు అమెరికా-భారత్ రెండింటికీ ప్రయోజనకరమని, ఇవి ఇన్నోవేషన్, ప్రొడక్టివిటీకి తోడ్పడుతాయని భారత్ వాదిస్తోంది. అమెరికా తాజా చర్యలు రెండు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు మద్దతుగా లేవని భారత్ అభిప్రాయపడింది. ఏది ఏమైనప్పటికీ.. అమెరికా తాజా ఇమ్మిగ్రేషన్ విధానాలు కేవలం తమ దేశీయ కార్మికుల సంరక్షణ కోసమేనని మార్కో రూబియో స్పష్టం చేయడం ద్వారా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.