హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో ఈనెల 28న ఈ–-వ్యర్థాల అవగాహన, సేకరణ, బాధ్యతాయుతమైన డిస్పోజల్ డే ను స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ లో భాగంగా ‘స్పెషల్ క్యాంపెయిన్- 6’ పేరుతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంపై స్కూల్ హెడ్మాస్టర్లకు అక్టోబర్ 23న ప్రత్యేక హ్యాండ్స్- ఆన్ ఓరియంటేషన్ సెషన్ నిర్వహించనున్నారు. ప్రతి విద్యార్థి తమ ఇండ్ల నుంచి కనీసం ఒక ప్రమాదకరం కాని పాత ఎలక్ట్రానిక్ వస్తువును తల్లిదండ్రుల అనుమతితో బడులకు తెచ్చేలా ప్రోత్సహించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే, పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను తెరవడం, విప్పదీయడం వంటివి అస్సలు చేయకూడదని ఆదేశించారు. పగిలిన సీఆర్టీ స్క్రీన్లు, పాడైపోయిన లేదా ఉబ్బిన లిథియం- అయాన్ బ్యాటరీలు, కెమికల్స్ కారే సెల్స్ వంటి ప్రమాదకర వ్యర్థాలను పిల్లలు ఎట్టిపరిస్థితుల్లోనూ తాకరాదని స్పష్టం చేశారు.
మార్నింగ్ అసెంబ్లీలో క్విజ్..
ఈనెల 28న ఉదయం స్కూల్ ప్రార్థనా సమయంలోనే ఈ–-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు కేంద్రం నిర్దేశించిన క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ లో చేపట్టిన సేకరణ, అవగాహన కార్యక్రమాలపై ఒక నిమిషం నిడివి గల షార్ట్ వీడియో, జియోట్యాగ్ చేసిన ఫొటోలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. దాన్ని ecoclubs.education.gov.in పోర్టల్‌లో స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆఫీసర్లు ఆదేశించారు. కాగా, స్కూళ్ల నుంచి సేకరించిన ఈ-వ్యర్థాలను ఎంఈవో పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కలెక్షన్ పాయింట్‌కు తరలించి భద్రపరచాలని సూచించారు.
