యువకుడి హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు.. 2020లో నర్సింలు గౌడ్ హత్య..ఐదేళ్ల తర్వాత తీర్పు

యువకుడి హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు.. 2020లో నర్సింలు గౌడ్ హత్య..ఐదేళ్ల తర్వాత తీర్పు
  • ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా 

మెదక్, వెలుగు: పాత కక్షలతో యువకుడిని హత్య చేసిన కేసులో ఏడుగురికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ గురువారం తీర్పు వెల్లడించారు. ఈ వివరాలను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన జెల్ల రాజారామ్ గౌడ్, యాడరం నాగరాజు గౌడ్ కుటుంబాల మధ్య పాత కక్షలతో గొడవలు జరిగి కేసులు నమోదయ్యాయి. 2020 మే 20న రాజారామ్ కుమారుడు నర్సింలు గౌడ్ (28) గ్రామ శివారులో తీవ్ర గాయాలతో కనిపించగా, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. 

పాత కక్షలతో ఆయుధాలతో దాడి చేశారని రాజారామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి సీఐ నాగార్జున గౌడ్ సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య వాదనలు వినిపించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులైన యాడరం నాగరాజు గౌడ్, బంధారం లక్ష్మీనారాయణ గౌడ్, బంధారం నాగరాజు గౌడ్, బంధారం నవీన్ గౌడ్, బంధారం గణేశ్ గౌడ్, యాడరం శేఖర్ గౌడ్, యాడరం రమేశ్ గౌడ్‌‌‌‌‌‌‌‌లకు జీవిత ఖైదు విధించింది. కేసులో కృషి చేసిన పోలీసు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య, కోర్టు లైజన్ అధికారి ఎస్సై విఠల్, కానిస్టేబుల్ రవీందర్, నిజాంపేట సీడీఓ మహేశ్‌‌‌‌‌‌‌‌లను ఎస్పీ 
అభినందించారు.