HCAకు రూ.92 కోట్ల నష్టం.. సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

HCAకు రూ.92 కోట్ల నష్టం.. సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

హైదరాబాద్‌: HCA హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కేసులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలైంది. HCAలో ఆర్థిక అక్రమాలపై 80 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. హెచ్‌సీఏకు రూ.92.08 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఐడీ వెల్లడించింది.

63 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తు్న్నారు. ఫోర్జరీ పత్రాలతో అధ్యక్ష పదవి పొందినట్లు జగన్మోహన్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. కృష్ణయాదవ్‌ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో వెల్లడైంది.

అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు, పర్యవేక్షణలోపంతో హెచ్‌సీఏకు భారీ నష్టం జరిగింది. హైకోర్టు ఆదేశాలున్నా రూ.39.11 కోట్ల మేర ఖర్చు చేసినట్లు గుర్తించారు. భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా రూ.18.5 కోట్ల ఉపసంహరణ, టెండర్లలో అక్రమాలు, ప్యాక్డ్‌ ఫుడ్‌ కాంట్రాక్టుతో రూ.12.09 లక్షల నష్టం వాటిల్లింది. టికెట్ల లెక్కల్లో 49,628 టికెట్ల వ్యత్యాసం ఉందని CID గుర్తించింది.

ALSO READ : నార్కోటిక్స్, సైబర్ నేరాలపై కట్టుదిట్టమైన చర్యలు..

టికెట్ల వ్యత్యాసంతో రూ.14.01 కోట్ల లెక్కల్లో చూపని ఆదాయానికి అవకాశం ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. కూకబుర్ర బంతుల కొనుగోళ్లలో అనుమానాలు ఉన్నాయని, రూ.94.84 లక్షల నష్టం జరిగిందని సీఐడీ పేర్కొంది. విమాన టికెట్ల ధరల పెంపు, ఏసీల కొనుగోలు పేరిట నిధుల దుర్వినియోగం జరిగిందని సీఐడీ తేల్చింది. ఐపీఎల్‌ టికెట్ల వివాదం.. 37 మంది ఆటగాళ్ల డేటా దుర్వినియోగం, అండర్‌-16 ఎంపికకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు కేసు నమోదైంది. ఇన్ని అంశాలను ఛార్జిషీట్లో సీఐడీ ప్రస్తావించింది.