స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఎనిమిది కుట్రలు బయటపెట్టిన జగన్..

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఎనిమిది కుట్రలు బయటపెట్టిన జగన్..

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ రోజు నుంచి ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. నామినేషన్ల సందర్భంగా ఏపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఎన్నికల సంఘానికి, కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేంతవరకు వెళ్ళింది పరిస్థితి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు ఎనిమిది కుట్రలు రచించారని అన్నారు జగన్. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని... వైసీపీ నామినేషన్లను అడ్డుకునేందుకు చంద్రబాబు వ్యవస్థలను కూడా దిగజార్చాడని మండిపడ్డారు జగన్.

జగన్ బయటపెట్టిన చంద్రబాబు ఎనిమిది ఎనిమిది కుట్రలు ఇవే:

వైసీపీ అభ్యర్థులకు బెదిరింపులు, ముందస్తు అరెస్టులు:

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ క్షణం నుంచే చంద్రబాబు కుట్రలు మొదలయ్యాయని.. మొదటి కుట్రలో భాగంగా వైసీపీ అభ్యర్థులను బెదిరించడం, ముందస్తు అరెస్ట్ చేయడం మొదలు పెట్టాడని అన్నారు. ఎలాగైనా వైసీపీ బ్యర్ధులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలన్నదే మొదటి కుట్ర ఉద్దేశమని అన్నారు జగన్.

వైసీపీ నాయకుల గృహనిర్బంధం:

రెండో కుట్రలో భాగంగా వైసీపీ నేతలను గృహనిర్బంధం  చేశారని... నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లే ఎమ్మెల్యేలు, ఎంపీలను గృహనిర్బంధం చేయడం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపడం చేశారని అన్నారు జగన్.

నామినేషన్‌ వేసేందుకు వచ్చినవారిని అడ్డుకోవడం:

చంద్రబాబు రెండు కుట్రలను దాటి నామినేషన్ వేసేవరకు వెళ్లిన అబ్యర్ధులపై మూడో కుట్ర ప్రయోగించారని.. ఏకంగా నామినేషన్ కేంద్రాల దగ్గర టీడీపీ శ్రేణులు వైసీపీ అభ్యర్థులపై దాడికి దిగారని.. నామినేషన్ పత్రాలు చించేశారని అన్నారు జగన్.

పోలీసుల ఎదుటే నామినేషన్ల పత్రాలు చించేయడం:

నామినేషన్ కేంద్రాల దగ్గర భద్రత కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని.. ఏకంగా పోలీసుల ఎదుటే వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించేశారని అన్నారు.

అధికార పార్టీ దాడులకు పోలీసులే సహకరించడం:

శాంతి భద్రతలు కాపాల్సిన పోలీసులే అధికార పార్టీ మూకకు సహకరించే స్థాయికి దిగజారిపోయారని అన్నారు జగన్. పోలీసుల ఎదుటే దాడులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోందని అన్నారు.

దాడులకు గురైన వారిపైనే కేసులు పెట్టడం:

దాడులకు గురైన వారిపైనే కేసులు పెట్టడం చంద్రబాబు మరో కుట్ర అని.. వాళ్ళే తమపై దాడి చేసి.. తమ అబ్యర్ధులపైనే అక్రమ కేసులు పెట్టారని అన్నారు జగన్.

స్క్రూటినీ పేరుతో అభ్యర్థుల తొలగింపు:

ఎన్నికల సంఘం అధికారులను కూడా చంద్రబాబు కుట్రలో భాగం చేశారని.. స్క్రూటినీ పేరుతో అభ్యర్థులను తొలగించారని.. స్క్రూటినీకి హాజరు కాకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని అన్నారు.

 

ALSO READ : నామినేషన్ కే ఇలా ఉంటే.. పోలింగ్ రోజు పరిస్థితి ఏంటి..?: వైఎస్ జగన్

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తీసుకురావడం:

అన్ని కుట్రలను ఎదుర్కొని..నామినేషన్ వేసిన అభ్యర్థులను అడ్డుకునేందుకు ఎనిమిదో కుట్ర చేస్తున్నారని.. నామినేషన్ విత్ డ్రా చేసుకొమ్మని ఒత్తిడి తీసుకురావడం, మాట వినకపోతే దాడులకు కూడా పాల్పడుతున్నారని అన్నారు జగన్.