ఓట్ల చోరీని సహించబోం..జ్ఞానేశ్ ఈసీఐ పదవికి రాజీనామా చేయాల్సిందే: ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ

ఓట్ల చోరీని సహించబోం..జ్ఞానేశ్ ఈసీఐ పదవికి రాజీనామా చేయాల్సిందే: ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ
  • ఈసీఐ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నం
  • పాదయాత్రలో పాల్గొన్న ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ, కేవైఎస్, ఏఐఎస్‌‌‌‌‌‌‌‌ఏ..
  • ఏఐడీడబ్ల్యూఏ, ఏఐడీఎస్‌‌‌‌‌‌‌‌ఓ, సీపీఐ(ఎం)
  • విద్యార్థులు, రైతులు, మహిళా సంఘాల కార్యకర్తలు అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్ ప్రాసెస్ ఆపాలని, సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పీపుల్ ఎగైనెస్ట్ సర్  సంస్థ శుక్రవారం ఈసీఐ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించింది. 

గోల్ దక్ ఖానా నుంచి ఈసీఐ ప్రధాన కార్యాలయం వైపు వందలాది మంది ఆందోళనకారులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ నిరసన యాత్రను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు పలువురు విద్యార్థులు,  రైతులు, మహిళా సంఘాల కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక పరిస్థితులు తలెత్తకుండా నిషేధాజ్ఞలను అమలు చేశారు. 


వివిధ సంఘాల మద్దతు

విద్యార్థులు, రైతులు, పౌర హక్కుల కార్యకర్తలు, పలు ప్రజా సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన 'ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పీపుల్ ఎగైనెస్ట్ సర్' సంస్థ పిలుపు మేరకు నిరసన కొనసాగింది. దీనికి దేశంలోని ప్రముఖ విద్యార్థి, యువజన సంఘాలైన క్రాంతికారి యువ సంఘటన్ (కేవైఎస్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌‌‌‌‌‌‌‌ఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 

కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు, ఆందోళనకారులు ఈసీఐ ముట్టడిలో పాల్గొన్నారు. “జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి, ఓట్ల చోరీని ఏమాత్రం సహించబోం” వంటి నినాదాలతో ఢిల్లీ దద్దరిల్లింది.

రోడ్డుపైనే బైఠాయింపు

ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారురోడ్డుపై బైఠాయించారు. అక్కడే 'పీపుల్స్ పార్లమెంట్'ను నిర్వహించారు.ప్రజాస్వామ్య స్ఫూర్తిని చావనివ్వమని విద్యార్థి సంఘాల నేతలు తేల్చిచెప్పారు. దేశంలోని ప్రతి వీధిని ఒక జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌గా మార్చి గళం వినిపిస్తామని 
ఆందోళనకారులు హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా 88 సిటీల్లో నిరసనకు పిలుపు

సర్, సీఈసీకి వ్యత్రిరేకంగా చేస్తున్న పోరాటం తీవ్రతను మరింత పెంచేలా దేశవ్యాప్తంగా విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. సర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లోని దాదాపు 88 నగరాల్లో, 145 వివిధ ప్రజా సంఘాల భాగస్వామ్యంతో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ వరకు నిరసనలు నిరంతరం కొనసాగుతాయని..ఇందులో కార్మికులు, రైతులు, మహిళలు, యువత అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.