మహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తి:గవర్నర్‌‌ శివ ప్రతాప్‌‌ శుక్లా

మహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తి:గవర్నర్‌‌ శివ ప్రతాప్‌‌ శుక్లా
  • గవర్నర్‌‌ శివ ప్రతాప్‌‌ శుక్లా
  • మహిళా ప్రముఖులకు అవార్డులు అందజేత

హైదరాబాద్‌‌, వెలుగు: మహిళలకు సమాన అవకాశాలు, స్వేచ్ఛ, భద్రత, గౌరవం కల్పించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని గవర్నర్‌‌ శివ ప్రతాప్‌‌ శుక్లా అన్నారు. శుక్రవారం ది న్యూ ఇండియన్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 41వ దేవీ అవార్డుల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. బేటీ బచావో.. బేటీ పఢావో, జననీ సురక్ష యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. 

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లఖ్‌‌పతి దీదీ కార్యక్రమం ద్వారా 3 కోట్ల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే సాధించారని, తదుపరి లక్ష్యాన్ని 6 కోట్లకు పెంచారని వివరించారు. దేవీ అవార్డులు అందుకుంటున్న 10 మంది మహిళలు వారి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని గవర్నర్‌‌ ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెచ్చిన షూటర్‌‌ ఈషా సింగ్‌‌, సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్న నటి, నిర్మాత నిహారిక కొణిదెల, జల సంరక్షణకు కృషి చేస్తున్న వాస్తుశిల్పి కల్పనా రమేశ్‌‌, కృత్రిమ మేధతో ఆహార భద్రతకు తోడ్పడుతున్న సాంకేతిక నిపుణురాలు వైశాలి నియోటియా సేవలను ప్రస్తావించారు. 

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న విద్యా రావు, తెలంగాణ చేనేత కళను ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాషన్‌‌ డిజైనర్‌‌ యక్షిణి దీప్తి రెడ్డి, హైదరాబాద్‌‌ వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్న చరిత్రకారిణి పి. అనురాధా రెడ్డి, బాలికల విద్య, బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న విద్యావేత్త బొంపల్లి భవాని, తెలంగాణ తొలి మహిళా లైన్‌‌ ఉమెన్‌‌ బబ్బూరి శిరీష, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్‌‌ శిరీషా సెంథిల్‌‌ సేవలను ఆయన అభినందించారు.