ఎల్నినోపై ఆల్‌‌‌‌‌‌‌‌పార్టీ మీటింగ్ పెట్టండి..వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుందాం: రాంచందర్ రావు

ఎల్నినోపై ఆల్‌‌‌‌‌‌‌‌పార్టీ  మీటింగ్ పెట్టండి..వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుందాం: రాంచందర్ రావు
  • రైతు సమస్యలపై రాజకీయం చేసే ఉద్దేశం బీజేపీకి లేదు
  • నష్టంపై నివేదిక ఇవ్వకుండా కేంద్రంపై నిందలేస్తే ఎలా?
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై ఎల్‌‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. అందరి అభిప్రాయాలు, వ్యవసాయ నిపుణులను పిలిచి సలహాలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌‌వీ సుభాష్‌‌తో కలిసి ఆయన మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. ఎల్‌‌నినోపై రాజకీయం చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అఖిలపక్ష భేటీ పెడితే సలహాలు ఇస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ ఎక్కడ పోతుందోననే భయంతో ఢిల్లీ షికార్లు చేస్తున్నారని ఆరోపించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి రిపోర్టు పంపితే సాయం అందుతుందన్నారు. 

ఫేక్ క్యాంపెయిన్‌‌తో డైవర్షన్‌‌..

ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ క్యాంపెయిన్లు నిర్వహిస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. ఓట్ల చోరీ జరిగితే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎలా గెలిచారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 1న హైదరాబాద్‌‌లో ‘లోక్‌‌తంత్ర్ బచావో–అరాచక్ హటావో’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం కరీంనగర్, సిద్దిపేట సహా మరో ఐదు ప్రాంతాల్లో విడతలవారీగా పాదయాత్రలు చేపడతామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శనివారం రాష్ట్ర పార్టీ ఇన్‌‌చార్జి సునీల్ బన్సల్‌‌తో సమావేశం తర్వాత తుది జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్నికల కమిటీకి పంపిస్తామని చెప్పారు.