ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ (కేఎన్‌ఏ) పేరుతో వచ్చిన మెయిల్‌లో నటుడు అమితాబ్ బచ్చన్, గాయకుడు దిల్‌జిత్ దోసాంజ్ కచేరీలతో పాటు నగరంలోని పలు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని, అది బూటకపు బెదిరింపు ఈమెయిల్ అని పోలీసులు స్పష్టం చేశారు.
