బెంగళూరు సిటీలో భూకంపం.. భయం వద్దంటూ అధికారుల భరోసా

బెంగళూరు సిటీలో భూకంపం.. భయం వద్దంటూ అధికారుల భరోసా

కర్నాటక రాజధాని బెంగళూరు సిటీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నెలలో మూడు సార్లు భూమి కంపించగా.. తాజాగా మరో భూకంపం బెంగళూరు సిటీని కలవర పెట్టింది. రిక్టర్  స్కేల్ పై తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణా నష్టం జరగనప్పటికీ తరుచుగా భూమి కంపిస్తుండటంతో ఏదో జరుగుతుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో   కంగారు పడాల్సిందేమీ లేదని సిస్మోలజీ సెంటర్స్ ప్రజలకు సూచనలు చేశారు. 

బెంగళూరులో శుక్రవారం(అక్టోబర్ 23) రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.  బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపూర్ తాలూకా తుబగేరె గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మోజనహళ్లి గ్రామానికి ఉత్తరాన భూకంప కేంద్రం ఉన్నట్లు కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC), నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారులు గుర్తించారు. 

భూకంప కేంద్రం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు.ఈ ప్రాంతం సీస్మిక్ జోన్-2 పరిధిలో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. 

ఇటీవల కర్ణాటకలోని విజయపురి జిల్లాలో కూడా వరుసగా భూకంపాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో బసవన బాగేవాడి సమీపంలో 3.5 తీవ్రతతో ఒకసారి, 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అదే నెలలో మరో 3.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనలను KSNDMC ఆధ్వర్యంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రాలు గుర్తించాయి.

బెంగళూరులో నమోదైన తాజా భూకంపం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రకంపనలు స్వల్పంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.