టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, తెలంగాణ జానపద గాయని నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఇడుపు కాయితం'. తెలంగాణ మట్టి వాసన.. పల్లెటూరి ప్రేమలు.. కుటుంబ బంధాలు.. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి రెండో పాట 'గడప' ను రిలీజ్ చేశారు.
కొత్త కోడలి అడుగులతో..
ఇప్పటికే విడుదలైన తొలి పాట 'శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత..' తనదైన తెలంగాణ ఫోక్ టచ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటోంది. ప్రియదర్శి, నాగదుర్గ మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ, ఆహ్లాదకరమైన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు రెండో సింగిల్‌గా వచ్చిన 'గడప' పాట కుటుంబ అనుబంధాలను, సంప్రదాయాలను గుర్తుచేసేలా సాగుతోంది.
పెళ్లి తర్వాత కొత్త కోడలు అత్తవారింటి గడప తొక్కే సందర్భంలో ఆమె మనసులో కలిగే భావోద్వేగాలు, కొత్త జీవితంపై ఆశలు, కుటుంబంలో అడుగుపెట్టే మధురమైన అనుభూతులను ఈ పాట ప్రతిబింబించేలా ఉంది. అభినయ శ్రీనివాస్ అందించిన సాహిత్యానికి తేజు విజయ స్వరం తోడవగా, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తనదైన బాణీతో పాటకు ప్రత్యేకత తీసుకొచ్చారు.
సుకుమార్ సమర్పణలో..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో, నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణ గ్రామీణ కుటుంబ నేపథ్యంలో రూపొందుతోంది. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మౌనిక రెడ్డి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి వెండితెరపై ప్రియదర్శి, నాగదుర్గ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో, తెలంగాణ నేటివిటీతో కూడిన ఈ కథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి..
