హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవల ద్వారా ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా ప్రజలు తమ ఇంటి వద్దనే పొందవచ్చని వెల్లడించారు. ఆధార్ నమోదు, అప్‌డేట్ సేవలను సైతం డోర్‌స్టెప్ విధానంలో అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
మీ సేవా డోర్‌స్టెప్ సేవలను పొందాలనుకునే పౌరులు 1100 నంబర్‌కు కాల్ చేసి తమకు అవసరమైన సేవలను బుక్ చేసుకోవచ్చు. అలాగే మీ సేవా పౌరుల పోర్టల్ ద్వారా కూడా సేవలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. బుకింగ్ పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మీ సేవా ప్రతినిధి ఇంటికి వచ్చి సంబంధిత సేవలను అందిస్తారు.
తొలి నెలలోనే 3,885 కాల్స్
మీ సేవా డోర్‌స్టెప్ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలు ప్రారంభమైన తొలి నెలలోనే 1100 నంబర్‌కు 3,885 కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించి, సులభంగా సేవలు పొందేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.
ప్రస్తుతం క్యూర్ పరిధిలో సేవలు
ప్రస్తుతం క్యూర్ పరిధిలో మీ సేవా డోర్‌స్టెప్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు బుక్ చేసుకున్న సేవను బట్టి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సేవల వివరాలు, బుకింగ్ విధానం, ఫీజులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పారదర్శక సేవలే లక్ష్యం
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, సేవల పంపిణీలో పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సాంకేతికతను వినియోగించుకుంటూ పౌరులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డోర్‌స్టెప్ సేవల విస్తరణతో ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
