Aamir Khan: 30 ఏళ్ల సినీ ప్రయాణంలో తీరని వెలితి.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.!

Aamir Khan: 30 ఏళ్ల సినీ ప్రయాణంలో తీరని వెలితి.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.!

సినిమా కోసం పరుగులు తీశా.. కానీ కుటుంబంతో గడపాల్సిన విలువైన క్షణాలను కోల్పోయానని భావోద్వేగానికి గురైయ్యారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. తెరపై అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఈ స్టార్ హీరో.. తన జీవితంలోని బాధాకరమైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ఈ భావోద్వేగ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

30 ఏళ్ల ప్రయాణం.. తీరని వెలితి..

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమీర్ ఖాన్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్క్రీన్ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు పీటర్ చాన్ హో-సన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న ఆయన.. తన కెరీర్‌లో అత్యంత బలహీనమైన క్షణాల పంచుకున్నారు.  దాదాపు 30 ఏళ్లపాటు పనిలోనే మునిగిపోయానని, సినిమాలపై ఉన్న మక్కువతో కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారని గుర్తించినప్పుడు తనలో తీవ్ర వెలితి కలిగిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేక ప్రేక్షకులకు క్షమాపణ చెప్పారు.

మారిన ఆలోచన..

కోవిడ్ సమయంలో తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్న అనుభవాన్ని వివరించారు. ఈ అనుభవం తన జీవితంలో కీలకమైన మార్పుకు కారణమైందని అమీర్ వెల్లడించారు. గత నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నానని తెలిపారు. ఈ విషయం 86 ఏళ్ల వయసులో కాకుండా 56 ఏళ్లకే అర్థమవడం సంతోషంగా ఉందని చెప్పారు.

కెరీర్ ఆరంభంలోనూ కన్నీళ్లే..

1988లో 'ఖయామత్ సే ఖయామత్ తక్' విజయంతో గుర్తింపు తెచ్చుకున్న అమీర్.. ఆ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే తొమ్మిది సినిమాలకు సంతకాలు చేశారట. షూటింగులు ప్రారంభమైన తర్వాత తన నిర్ణయం ఎంత పెద్ద పొరపాటో అర్థమైందని, అప్పట్లో తన మొదటి భార్య రీనా దత్తా దగ్గర బాధపడుతూ ఏడ్చేవాడినని గుర్తుచేసుకున్నారు. వరుస పరాజయాలతో తనను 'వన్ ఫిల్మ్ వండర్' అని పిలిచారని, ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని తెలిపారు.

'లగాన్'కు ప్రత్యేక ప్రదర్శన..

చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది సమష్టి కృషితో సాధ్యమయ్యే కళ అని  అమీర్ ఖాన్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫెస్టివల్‌కు రావడం ప్రత్యేకమని తెలిపారు. తాను నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం 'లగాన్' 25వ వార్షికోత్సవ ప్రదర్శన కూడా ఈ వేడుకలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి హృదయాలను తాకుతున్నాయి.  సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.