ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీమ్ కాంస్య విగ్రహాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఘనంగా ఆవిష్కరించారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కొమురం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయాలు, నినాదాల మధ్య తమ పోరాట యోధుడికి నివాళులర్పించారు. అనంతరం ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆదివాసీలు పాల్గొన్నారు.
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడికి నివాళి
అడవి, భూమి, నీటిపై ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ త్యాగాలను ఈ సందర్భంగా గిరిజనులు స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.కొమురం భీమ్ ఆశయాలను సాధించడంతో పాటు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని పలువురు పిలుపునిచ్చారు.
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బహిరంగ సభలో ఆదివాసీలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోడు భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, అర్హులైన గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.
ALSO READ : కోడలు కారు ప్రమాదం వెనుక జోగి రమేశ్ హస్తం ..
గిరిజనుల భూముల హక్కులు, జీవనోపాధి, ఇతర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
