విజయవాడ: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానిస్తూ మేఘన తండ్రి కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అక్టోబర్ 15న మేఘన తన తండ్రి కృష్ణతో కలిసి విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు కొంత భాగం దెబ్బతింది.
దీనిపై కృష్ణ ఈ నెల 16న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉందనే అనుమానాల నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు అప్పటికే కేసు నమోదు చేశారు..
ఈ కారు ప్రమాదం వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉండొచ్చని కృష్ణ తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీయాలని పోలీసులను కోరారు.
ఇప్పటికే కుటుంబ సభ్యులపై ఫిర్యాదు
మేఘన గతంలో తన మామ జోగి రమేష్, భర్త రాజీవ్, ఇతర కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, వరకట్న వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని సుమారు మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కారు ప్రమాదంపై కూడా అనుమానాలు వ్యక్తం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
