విద్యుత్ ఉద్యోగుల సమ్మె: కరెంట్, నీళ్లు లేక అల్లాడిపోతున్న గురుగ్రామ్ ప్రజలు.. ఫ్యాక్టరీలు బంద్

విద్యుత్ ఉద్యోగుల సమ్మె: కరెంట్, నీళ్లు లేక అల్లాడిపోతున్న గురుగ్రామ్ ప్రజలు.. ఫ్యాక్టరీలు బంద్

హర్యానాలోని గురుగ్రామ్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన 3 రోజుల సమ్మె నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్రైవేట్ సంస్థ 'ఎలెవన్ పవర్'కు సమాంతర విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ మొదలైన ఈ ఆందోళనతో లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు అంధకారంలోకి నెట్టింది. కరెంట్ లేక ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు మూలనపడగా, నీటి సదుపాయం కూడా నిలిచిపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.

గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు..
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో నీటి మోటర్లు పనిచేయక తాగునీటికి కూడా కొరత ఏర్పడింది. సెక్టార్ 9ఏ, హరినగర్, పాలామ్ విహార్, సుశాంత్ లోక్ వంటి ప్రాంతాల్లో 16 గంటలకు పైగా కరెంట్ లేకపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్‌వర్టర్లు పనిచేయక, మొబైల్ టార్చ్ లైట్ల వెలుతురులోనే ఇళ్లలో వంటలు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. చిన్న పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో విసుగు చెందిన జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.

ఫ్యాక్టరీల్లో నిలిచిన ఉత్పత్తి.. కోట్లల్లో నష్టం
కేవలం ఇళ్లే కాకుండా గురుగ్రామ్ పారిశ్రామిక ప్రాంతంపై కూడా ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. సెక్టార్ 37, కదిపూర్, బసాయి ప్రాంతాల్లోని దాదాపు 18 వందల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లలో యంత్రాలు నిలిచిపోయాయి. టెక్స్‌టైల్స్, ఆటో కాంపోనెంట్స్, ఎక్స్‌పోర్ట్ ఆధారిత కంపెనీలు పూర్తిగా మూతపడ్డాయి. డీజిల్ జనరేటర్లపై ఆధారపడదామంటే నిబంధనలు అడ్డంకులతో పారిశ్రామికవేత్తలు సతమతమయ్యారు. నిరంతరం జనరేటర్లు నడిపితే వేడెక్కి ఆగిపోతాయని, ఇది శాశ్వత పరిష్కారం కాదని వాపోయారు. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే కోట్లాది రూపాయల నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె మొదటి 12 గంటల్లోనే దాదాపు 3వేల ఫిర్యాదులు అందగా.. హెల్ప్‌లైన్‌లకు వేల సంఖ్యలో కాల్స్ వచ్చాయని దక్షిణ హర్యానా విద్యుత్ వితరణ నిగమ్(DHBVN) అధికారుల చెప్పారు. అయితే 98% మంది ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఫిర్యాదులను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. ప్రత్యామ్నాయంగా కాంట్రాక్టు కార్మికులను రంగంలోకి దించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ప్రభుత్వం ఈ సమ్మె అనవసరమని, ప్రైవేట్ లైసెన్స్‌ను కోర్టులో సవాల్ చేస్తామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సమస్య మాత్రం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వం, విద్యుత్ సంఘాల మధ్య ప్రతిష్టంభన వీడే వరకు తమ కష్టాలు ఇలాగే కొనసాగుతాయని అక్కడి ప్రజలు, ఇండస్ట్రీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.