మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో పట్టపగలే దారుణం జరిగింది. జిమ్ నుంచి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. అనంతరం అతడిపై హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన దీక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని సిడ్కో ప్రాంతం ఎన్-7లోని బజరంగ్ చౌక్ సమీపంలో గురువారం(అక్టోబర్ 22) ఈ ఘటన జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. దేవేష్ అలియాస్ బంటీ దీక్షిత్ జిమ్ నుంచి స్కూటర్‌పై తిరిగి వస్తుండగా పవన్ పరాశర్ అనే వ్యక్తి తన కారుతో వెనుక నుంచి అతడి స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో దీక్షిత్ రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత పరాశర్ హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో అతడి తల, ముఖంపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో దీక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దాడి అనంతరం పవన్ పరాశర్ సిడ్కో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఘటనలో ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి ఉపయోగించిన ఇనుప రాడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పరాశర్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
దేవేష్ దీక్షిత్ ఓ మెస్ నిర్వహించడంతో పాటు నిర్మాణ వ్యాపారంలోనూ పాల్గొంటున్నట్లు ప్రాథమిక సమాచారం. అతడికి, పవన్ పరాశర్‌కు మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పాత కక్షలు లేదా వ్యాపార సంబంధిత వివాదం ఈ హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో చర్చ జరుగుతోంది.
అయితే హత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి పాత్ర, బాధితుడితో ఉన్న వివాదం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు, ఇతర వివరాల ఆధారంగా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
