- 9 వేల మంది విద్యార్థులకు రోజూ 25 లక్షల లీటర్ల నీళ్లు అవసరం
- ఎల్ నినో కారణంగా 15 లక్షల లీటర్లకు పడిపోయిన నీటి సరఫరా
- ఇవాళ్టి నుంచి ప్రారంభం.. కావాల్సిన తరగతులు వాయిదా
- గోదావరి నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటం: అధికారులు
మంచిర్యాల/నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవకపోవడం, అలాగే సమీపంలోని చెరువు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇక్కడ నీటి కటకట మొదలైంది. దసరా సెలవుల వరకు ఎలాగోలాగా నెట్టుకొచ్చిన అధికారులు నీటి సరఫరా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే దసరా సెలవుల అనంతరం క్యాంపస్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా అధికారులు నీటి కొరత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సెలవులను మరికొద్ది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. క్యాంపస్ కు నీటిని అందిస్తున్న సమీప చెరువులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది.
క్యాంపస్‌లో 9 వేల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 15 లక్షల లీటర్లు మాత్రమే సప్లయ్ అవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఒకవేళ క్యాంపస్‌ను తిరిగి ప్రారంభించినట్లయితే దాదాపు 10 లక్షల లీటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. సెలవుల పొడగింపు మాత్రమే ప్రత్యామ్నాయంగా నిర్ధారించారు.
దీంతో సెలవులు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. గోదావరి నది నుంచి నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నీటి సరఫరా 25 లక్షల లీటర్లకు పైగా జరిగిన తర్వాతనే తరగతులు ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
