మంచిర్యాలలో ‘హైటెన్షన్’ ..కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావుపై దాడికి ఓ వర్గం ప్లాన్?

మంచిర్యాలలో ‘హైటెన్షన్’ ..కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావుపై దాడికి ఓ వర్గం ప్లాన్?
  • ముందస్తు సమాచారంతో మోహరించిన పోలీసు బలగాలు 
  • తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ సందర్భంగా మొదలైన గొడవ 
  • మూడు రోజులుగా కొనసాగుతున్న పోలీసుల పికెటింగ్​ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీలో నెలకొన్న విభేదాలు బుధవారం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ మంతన జగన్​మోహన్​రావుపై మరో వర్గం దాడికి ప్లాన్​ చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్​ అయిన పోలీసులు బైపాస్​ రోడ్డులోని జగన్​మోహన్​రావు నివాసం పరిసర ప్రాంతాలు, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉదయం నుంచే భారీగా సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు రెండు వందల మంది పోలీసులతో పికెటింగ్​ ఏర్పాటు చేశారు. 

వజ్ర వాహనాన్ని సైతం రెడీగా ఉంచారు. మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, గోదావరిఖని ఏసీపీలు, మంచిర్యాల, జైపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని, మంథని సీఐలు, పలువురు ఎస్సైలతో బందోబస్తు నిర్వహించారు. జగన్​మోహన్​రావు నివాసం వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్లను బ్లాక్​ చేశారు. సమీపంలోని షాపులను బంద్​ చేయించారు. 

అదే సమయంలో మంచిర్యాలలోని ఓ ప్రజాప్రతినిధి నివాసం వద్దకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్​ నెలకొంది. మరోవైపు రామగుండం పోలీస్​ కమిషనర్​అంబర్​ కిశోర్​ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్​ ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సమీక్ష జరుపుతూ పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాళ్లపేటలో ఘర్షణతో... 

దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సందర్భంగా మొదలైన ఘర్షణలే మంచిర్యాలలో హైటెన్షన్​కు కారణమని తెలుస్తోంది. బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్ద కాంగ్రెస్​ లీడర్​ దుర్గాప్రసాద్​ పటాకులు కాల్చడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో పోలీసులు స్థానిక ఆదివాసీ మహిళా సర్పంచ్, ఉపసర్పంచ్​లపై లాఠీచార్జి చేశారని ఆరోపణలు వచ్చాయి. 

దీనికి నిరసనగా జగన్​మోహన్​రావు అదే రాత్రి తాళ్లపేటకు చేరుకొని ధర్నా చేపట్టారు. అనంతరం సోమవారం తాళ్లపేటలో రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ కేసులో జగన్​మోహన్​రావు గ్రూపునకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందులో నలుగురిని అరెస్టు చేశారు. వారిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు. 

కాగా, జగన్​మోహన్​రావుతో పాటు ఆయన ముఖ్య అనుచరులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేయాలంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధి పోలీసులపై ప్రెజర్​ చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో మంచిర్యాలలో ఎప్పుడేం జరుగుతుందనే టెన్షన్​ నెలకొన్నది.