ఆమె లోక్ సభ మాజీ స్పీకర్.. సీనియర్ రాజకీయ నేత. పార్లమెంట్ సభ్యురాలిగా దశాబ్దాలుగా పని చేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ గా ఉన్నారు.. ఆమెనే మీరాకుమార్. అంత పెద్ద రాజకీయ వేత్త అయిన మీరాకుమార్ కు 50 ఏళ్ల తర్వాత బీహార్ ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం పొందే హక్కు లభించింది. ఏంటీ ఇంత పెద్ద రాజకీయనేత, లోక్ సభ మాజీ స్పీకర్ కు 50 ఏళ్ల తర్వాత భూసేకరణ పరిహారం రావటం ఏంటీ అనే డౌట్ వస్తుంది కదా.. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..
2026 అక్టోబర్ 21న పాట్నా హైకోర్టు పిటిషన్ను అనుమతిస్తూ, సుమారు 50 ఏళ్ల క్రితం సేకరించిన భూమికి పరిహారం పొందేందుకు ఆమె అర్హురాలని తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఖతీం రజా ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాట్నా జిల్లా కలెక్టర్ 2023 ఏప్రిల్ 12న జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ, కుటుంబం పేరిట ఉన్న జమాబంది (భూమి రికార్డులు)ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఈ కేసు పాట్నాలోని మైన్పురా ప్రాంతంలోని సుమారు 18 కట్టా 10 ధూర్ (సుమారు అర ఎకరం) భూమికి సంబంధించినది. 1975-76లో రాష్ట్ర ప్రభుత్వం నాలా (కాలువ) నిర్మాణం కోసం ఈ భూమిని సేకరించింది. సేకరించిన భూమిలో నాలా నిర్మాణం జరిగినప్పటికీ, భూమి హక్కుదారులైన ఇంద్రాణి దేవి, ఆ తర్వాత ఆమె వారసురాలైన మీరా కుమార్కు పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ జమాబందిని రద్దు చేసి, ఆ భూమిని గైర్ మజరువా ఆమ్ (ప్రజా భూమి)గా ప్రకటించారు.
1941 నాటి బందోబస్తుపై ప్రశ్న
హైకోర్టు బీహార్ భూసంస్కరణ చట్టం 1950లోని సెక్షన్ 3, 4(హెచ్)ను వివరిస్తూ, సెక్షన్ 4(హెచ్) కింద చర్యలు తీసుకునే ముందు సంబంధిత ఆస్తి చట్టపరంగా రాష్ట్రం పరిధిలోకి వచ్చిందని నిరూపించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ను సమర్పించలేకపోయింది.
త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం, ఈ భూమి అసలు బందోబస్తు 1941లో జరిగిందని కోర్టు గుర్తించింది. అయితే సెక్షన్ 4(హెచ్) జనవరి 1, 1946 తర్వాత జరిగిన బదిలీలు లేదా బందోబస్తులపైనే వర్తిస్తుంది. దశాబ్దాల పాత జమాబంది, రెవెన్యూ రికార్డులను సంక్షిప్త పరిపాలనా చర్యల ద్వారా రద్దు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మీరా కుమార్కు పాత భూమి సేకరణ కేసులో పరిహారం పొందే అవకాశం లభించింది.
