Payal Rajput : నా శరీరం.. నా ఇష్టం.. మీకెందుకు?.. బాడీ షేమింగ్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్!

Payal Rajput : నా శరీరం.. నా ఇష్టం.. మీకెందుకు?.. బాడీ షేమింగ్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్!

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ మరో సారి హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని వీడియోలు షేర్ చేస్తూ, అసభ్యంగా కామెంట్లు చేస్తున్న వారికి గట్టిగా బదులిచ్చారు. తన శరీరం, తన రూపం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ ఘాటైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మీ హద్దుల్లో మీరు ఉండండి..

బుధవారం అర్ధరాత్రి ఎక్స్‌ వేదికగా స్పందించిన పాయల్.. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. "నా శరీరంపై అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఈ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజు, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు, మీ అసభ్యతకు సంబంధించిన విషయాలు కావు. మీ హద్దుల్లో మీరు ఉండండి.. మీ పని మీరు చూసుకోండి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత రూపాన్ని విమర్శిస్తూ ఇతరులను కించపరచడం ఎంతవరకు సమంజం అంటూ ప్రశ్నించింది పాయల్. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

పాయల్‌కు మద్దతుగా నెటిజన్లు..

పాయల్ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మీ కోపం, ఆవేదన సమంజసమే. మీకు భద్రత, గౌరవం, ప్రశాంతత లభించాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు, ఆమె పోస్ట్ చూసిన తర్వాతే అసలు విషయం తెలిసిందని కొందరు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది. ఒకరి శరీరాకృతిపై అవమానకరంగా మాట్లాడటం సరికాదని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు నెటిజన్లు.

ALSO READ :  రామ్ చరణ్ సరసన 'సయ్యారా' బ్యూటీ.. సుకుమార్ మనసులో అసలు ఎవరున్నారంటే?

సినిమాలతో ప్రత్యేక గుర్తింపు..

సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఎక్స్ 100'తో తెలుగు ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు తెచ్చుకున్న పాయల్, 'ఆర్డీఎక్స్ లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి చిత్రాల్లో నటించారు. 'మంగళవారం' సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం 'రక్షణ' చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించారు.  సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసే క్రమంలో కనీస గౌరవం, మర్యాద పాటించాలనే చర్చకు పాయల్ స్పందన మరోసారి తెరతీసింది.