చదువుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు డాక్టర్ అశోక్ కుమార్. ఆయన కోల్ ఇండియా లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యాక.. ఇప్పుడు 68 ఏళ్ల వయసులో రాంచీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీ కోర్సులో చేరి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దశాబ్దాల పాటు కార్పొరేట్ రంగంలో పెద్ద పదవుల్లో పనిచేసినప్పటికీ.. ఆయనలో నేర్చుకోవాలన్న తపన మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
కోల్ ఇండియా నుంచి రిటైర్ అయిన తర్వాత అశోక్ కుమార్ జేపీ గ్రూప్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత సలహాదారుడిగా సేవలు అందించి.. అక్టోబర్ 23, 2025న పూర్తిగా రిటైర్ అయ్యారు. అలా 2 సార్లు పదవీ విరమణ పొందినప్పటికీ.. ఆయనలోని జిజ్ఞాస, నేర్చుకునే కోరిక ఏమాత్రం సన్నగిల్లలేదు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా కొత్త విద్యను అభ్యసించేందుకు ముందుకొచ్చారు.
డాక్టర్ అశోక్ కుమార్ కేవలం రిటైర్డ్ ఉద్యోగే కాదు.. అసాధారణ ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌంట్ కలిగిన వ్యక్తి. ఆయన జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంటెక్ చేయడమే కాకుండా.. ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు
"ఇంజనీరింగ్ నాకు యంత్రాలను అర్థం చేసుకోవడం నేర్పింది. ఇప్పుడు నేను సైకాలజీ ద్వారా మనుషులను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవటానికి ఎప్పటికీ అంతం ఉండదు" అని అన్నారు. ఈ మాటలు ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయి.
ALSO READ : ఎల్‌నినో ఎఫెక్ట్ నుంచి బతికి బట్టకట్టాలంటే ఈ జాగ్రత్తలు కంపల్సరీ!
వయసులో తనకంటే ఎంతో చిన్నవారైన తోటి విద్యార్థులతో కలిసి రోజూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు. ఫ్యాకల్టీ మెంబర్లతో చురుగ్గా చర్చిస్తూ.. తరగతి గదిలో తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన అంకితభావాన్ని చూసి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పర్వెజ్ హసన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో సాధించినా.. విద్యపై ఇంతటి మక్కువ చూపించే విద్యార్థిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
