సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ దేశాల మధ్య బలమైన మతపరమైన, ఆర్థిక, కార్మిక సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవల సౌదీ ప్రభుత్వం ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మరణశిక్ష అమలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అక్టోబర్ 14న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
అసలు ఏం జరిగింది?
సౌదీలోని మక్కా నగరంలోని ఒక మసీదులో జరిగిన 'అసభ్యకరమైన చర్య'లో నజ్రుల్ ఇస్లామ్ అబ్దుల్ బాసిర్ (25), సితి అక్తర్ అనే ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది. కొన్ని వార్తా కథనాల ప్రకారం ఈ ఇద్దరూ పవిత్రమైన మతపరమైన ప్రాంతంలో ముద్దులు పెట్టుకున్నారని అందుకే వారిని ఉరితీసినట్లు పేర్కొన్నాయి. ఇస్లామిక్ చట్టంలోని 'తాజీర్' కింద జడ్జి ఈ శిక్ష ఖరారు చేశారు. అయితే ఆ ఇద్దరూ వివాహితులా లేక సహోద్యోగులా అనే దానిపై స్పష్టత లేదు. నజ్రుల్ 4 సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్లి మక్కాలోని మస్జిద్ అల్-హరామ్లో మెయింటెనెన్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సితి కూడా అక్కడే పనిచేస్తోంది.
మరణశిక్షకు గురైన వారి కుటుంబాలు మాత్రం దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. నజ్రుల్ సౌదీకి వెళ్లిన కొద్ది నెలలకే అరెస్ట్ అయ్యాడని.. జైలు నుంచి అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పని చేసే చోట ఒక పాకిస్థానీ జాతీయుడితో నజ్రుల్కు గొడవ జరిగిందని, ఆ వ్యక్తి చేసిన కుట్ర వల్లే నజ్రుల్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడని అతని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. సితి కుటుంబం కూడా తోటి మహిళా కార్మికులతో జరిగిన వివాదం కారణంగా ఆమెను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం సీరియస్:
తమ దేశ పౌరులకు మరణశిక్ష అమలు చేసిన విషయం మీడియా ద్వారా తెలియడంతో ఢాకా వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. తమ దౌత్య కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా.. కోర్టు తీర్పు కాపీలు అందించకుండా సౌదీ ఈ చర్య తీసుకోవడంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది వియన్నా కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని సౌదీ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరినప్పటికీ, రియాద్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ALSO READ : మీరు జెన్ జీ కాదు.. సీజేపీ నేతల పిటిషన్ ఉపసంహరణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం:
సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చిన్న తప్పుకు ఇంత కఠిన శిక్ష విధించడం అన్యాయమని, తమ పౌరులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. శ్రీలంక లాంటి ఇతర దేశాలు తమ పౌరులకు మరణశిక్ష నుంచి మినహాయింపు పొందగలిగినప్పుడు, బంగ్లాదేశ్ ఎందుకు స్పందించలేదని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. మృతదేహాలను అప్పగించాలని, ఈ రహస్య మరణశిక్షపై పూర్తి వివరాలు వెల్లడించాలని బాధిత కుటుంబాలతో పాటు బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది.
