గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం టీమిండియా మాజీ క్రికెటర్, లోక్ సభ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు భారీ గిఫ్ట్ ఇచ్చింది. వడోదరలో 14 ఏళ్లుగా వివాదంలో ఉన్న 978 చదరపు మీటర్ల ప్లాట్‌ను ఆయనకు కేటాయించేందుకు బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వడోదరలోని ఆయన నివాసానికి సమీపంలో ప్లాట్‌ను కేటాయించే ప్రక్రియ 14 ఏళ్లుగా నిలిచిపోయింది.
యూసుఫ్ పఠాన్‌కు BJP బంపర్ ఆఫర్ https://t.co/0qjyajV6PU
— V6 News (@V6News) October 20, 2026
978 చదరపు మీటర్ల ప్లాట్ తుది విలువ రూ. 20.53 కోట్లుగా (చదరపు మీటరుకు రూ. 2.10 లక్షలు) అంచనా. వాస్తవానికి ఇది ప్రభుత్వ స్థలం. తన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి యూసుఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. టీఎంసీ నుంచి ఎంపీగా గెలిచిన యూసుఫ్ పఠాన్ మమత పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వేలం కోసం కనీస ఆధార ధర లేదా అప్సెట్ విలువను నిర్ణయించిన తర్వాత.. పఠాన్‌కు ప్లాట్‌ను కేటాయించే ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెడతారు. ఈ కేటాయింపుపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని, ఇప్పుడు ఈ ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. కమిటీ ఆమోదం లభించిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, ప్లాట్ కోసం పఠాన్ చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును పరిశీలించిన తర్వాత మున్సిపల్ సంస్థ ఆ మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
2012లో.. వడోదరలోని తండల్జా ప్రాంతంలో ఉన్న తన బంగ్లా పక్కనే 978 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పఠాన్ వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. ఆ సంవత్సరం మార్చి 30, జూన్ 8 తేదీలలో జరిగిన సమావేశాలలో కేటాయింపు ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ బహిరంగ వేలం లేకుండా 99 సంవత్సరాల లీజుపై అతనికి భూమిని కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే.. 2014లో బహిరంగ వేలం లేకుండా ప్లాట్‌ను కేటాయించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.
2024లో, కేటాయింపు ప్రతిపాదన తిరస్కరణను కారణంగా చూపుతూ, ఈ ల్యాండ్‌ను యూసుఫ్ పఠాన్ ఆక్రమించారని తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. పఠాన్ ఈ నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. 2025 ఆగస్టు 21న, కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది . తదనంతరం పఠాన్, సింగిల్ జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు.
జూన్ 8, 2026న జరిగిన విచారణ సందర్భంగా, ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా కేటాయించకుండా, అవసరమైన చెల్లింపు చేయకుండా దానిని ఎలా ఆక్రమించారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో మున్సిపల్ అధికారుల పాత్రపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. అంతర్జాతీయ క్రికెటర్లకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఉటంకిస్తూ, పఠాన్ తరఫు న్యాయవాది తదుపరి వాదనలు వినిపించడానికి సమయం కోరారు. ఈ ఏడాది ఆగస్టు 31న పఠాన్ హైకోర్టులో తన అప్పీల్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం.
