సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి. ఈ మూవీ కోసం సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. లేటెస్ట్ గా మహేశ్ బాబు నటనపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. తన అంచనాలను మించి మహేశ్ నటించారని, తాను ఊహించిన దానికంటే 200 శాతం ప్రతిభను చూపించారని జక్కన్న ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బ్రెజిల్‌లోని 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరైన రాజమౌళి.. అక్కడ లియోన్ కాకాఫ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బ్రెజిలియన్ సినీ పోర్టల్ ఆక్సెంటే పిపోకాతో మాట్లాడిన ఆయన 'వారణాసి' విశేషాలను పంచుకున్నారు. మహేశ్ బాబు సామర్థ్యం గురించి తనకు ముందే తెలుసని, అయితే సెట్స్‌పై కలిసి పనిచేయడం మొదలయ్యాక ఆయన నటన తన అంచనాలను కూడా దాటిపోయిందని వెల్లడించారు.
పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి మహేశ్ ప్రాణం పోసిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. బాబుతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. చిత్రీకరణ విషయానికి వస్తే.. షూటింగ్‌కు ఇంకా సుమారు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కీలకంగా మారనున్నాయి.
మహేశ్ బాబు కేవలం హీరోయిజం, యాక్షన్‌కే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలతో 'వారణాసి'ని రూపొందిస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్లా కనిపించినా, వాస్తవానికి పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ కథ అని ఆయన స్పష్టం చేశారు. తండ్రీకొడుకుల మధ్య మొదట దెబ్బతిన్న బంధం తిరిగి ఎలా బలపడుతుంది? ఓ యువకుడు, యువతి మధ్య ప్రేమకథ ఎలా సాగుతుంది? అనే భావోద్వేగ అంశాలు కూడా ఇందులో కీలకంగా ఉంటాయని వెల్లడించారు.
ఆరేడు సినిమాల కథలను ఒకే చిత్రంలో కలిపిన అనుభూతిని కలిగించేలా 'వారణాసి'ని తీర్చిదిద్దడం అతిపెద్ద సవాలుగా రాజమౌళి అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కథ, విజువల్స్, భావోద్వేగాల మధ్య సమతుల్యత ఎలా సాధించారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ALSO REad : Aakasamlo Oka Tara OTT Deal: థియేటర్లలోకి రాకముందే స్టార్ హీరో మూవీ బడ్జెట్ రికవరీ?
ఈ 'వారణాసి' మూవీ ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మహేశ్ బాబు నటనపై రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి జక్కన్న చెబుతున్న ఆ 200 శాతం మ్యాజిక్ వెండితెరపై ఏ స్థాయిలో కనిపిస్తుంది? 'వారణాసి' అంతర్జాతీయ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? అన్నది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే...
