డబ్బులు కట్ అయ్యి వెనక్కి రాలేదా? బ్యాంకుల నుంచి రోజుకు రూ.100 పరిహారం వసూలు చేసుకోండి!

డబ్బులు కట్ అయ్యి వెనక్కి రాలేదా? బ్యాంకుల నుంచి రోజుకు రూ.100 పరిహారం వసూలు చేసుకోండి!

రోజువారీ అవసరాల్లో భాగంగా మనం UPI పేమెంట్లు చేయడం, ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తూనే ఉంటాం. అయితే ఒక్కోసారి సర్వర్ డౌన్ కావడం, నెట్‌వర్క్ ఇష్యూ లాంటి సాంకేతిక సమస్యలతో లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. ఆ సమయంలో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి కానీ అవతలి వారికి చేరవు. కొన్నిసార్లు ఏటీఎం నుంచి క్యాష్ బయటకు రాకుండానే అకౌంట్లో కట్ అవుతుంటాయి. ఈ సమయంలో మనకు వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. డబ్బులు వెనక్కి రాకపోగా.. బ్యాంకులు లేదా పేమెంట్ యాప్‌ల నిర్లక్ష్యానికి RBI గట్టి షాక్ ఇచ్చే అద్భుతమైన నిబంధన తెచ్చిందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు.

అవును మనం చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు నిర్దిష్ట గడువులోగా బ్యాంకులు డబ్బును తిరిగి మన అకౌంట్లో జమ చేయకపోతే.. ప్రతి రోజూ ఆలస్యానికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నష్టపరిహారం కేవలం ఫెయిల్ అయినందుకు మాత్రమే కాదు.. బ్యాంకులు ఆలస్యం చేసే ప్రతి రోజుకు చెల్లించే జరిమానా అన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా మీరు ఎక్కడా ఫిర్యాదు చేయాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్‌గా ఖాతాలో జమ చేయాలని ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏ సందర్భాల్లో రోజుకు రూ. 100 ఫైన్ పడుతుంది? 

1. ATM లావాదేవీలు: మీ అకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అయి.. ఏటీఎం నుంచి క్యాష్ రాకపోతే ఈ సమస్యను గరిష్టంగా T+5 రోజుల్లోగా (T అంటే లావాదేవీ జరిగిన రోజు) బ్యాంకులు పరిష్కరించాలి. ఒకవేళ T+5 రోజులు దాటితే.. ఆ తర్వాత ప్రతి రోజూ ఆలస్యానికి రూ.100 చొప్పున అకౌంట్ హోల్డర్ కి చెల్లించాలి.

2. UPI ఫండ్ ట్రాన్స్‌ఫర్: ఒకరి అకౌంట్ నుంచి మరొకరికి యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు.. అకౌంట్లో అమౌంట్ కట్ అయ్యి బెనిఫిషియరీకి చేరకపోతే, బెనిఫిషియరీ బ్యాంక్ దీన్ని T+1 రోజులోపు ఆటో-రివర్సల్ చేయాలి. ఆ గడువు దాటితే రోజుకు రూ.100 జరిమానా వర్తిస్తుంది.

3. యూపీఐ మర్చంట్ పేమెంట్స్: ఏవైనా కొన్నప్పుడు షాపుల్లో వ్యాపారులకు చేసే యూపీఐ పేమెంట్లు ఫెయిల్ అయి కన్ఫర్మేషన్ రాకపోతే.. T+5 రోజుల్లోపు ఆటో-రివర్సల్ కావాలి. లేదంటే రోజుకు బాధితుడికి రూ.100 ఫైన్ చెల్లించాల్సిందే.

4. కార్డ్ పేమెంట్లు & ఈ-కామర్స్: పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్ ఈ-కామర్స్ లావాదేవీల్లో అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయి మర్చంట్‌కు చేరకపోతే T+5 రోజుల్లోపు రివర్స్ కావాలి. గడువు దాటితే రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి.

5. కార్డ్-టు-కార్డ్ పేమెంట్స్ & IMPS: ఈ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే లావాదేవీల్లో డబ్బులు కట్ అయ్యి అవతలి ఖాతాకు చేరకపోతే T+1 రోజులోపు రివర్స్ చేయాలి. లేదంటే ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.100 చొప్పున ఫైన్ చెల్లించాల్సిందే.

6. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AEPS) & NACH/APBS: ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు లేదా సబ్జెక్ట్ డెబిట్ ఆదేశాలు రద్దు చేసినా డబ్బులు కట్ అయితే.. నిర్దేశిత గడువు (T+1 రోజు లేదా T+5 రోజులు) లోపు క్లియర్ చేయాలి. విఫలమైతే రూ.100 రోజువారీ జరిమానా వర్తిస్తుంది.

ఒకవేళ బ్యాంకులు ఈ గడువు లోపు సమస్యలను పరిష్కరించలేకపోతే.. కస్టమర్లు ఎలాంటి క్లెయిమ్ చేయకుండానే ఆటోమేటిక్‌గా ఈ డబ్బు మీ ఖాతాలో జమ కావాలి. ఒకవేళ బ్యాంక్ నుంచి స్పందన లేకపోతే 30 రోజుల్లోపు ఆర్‌బీఐ ఓంబ్‌డ్స్‌మన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇకపై ఫెయిల్ అయిన లావాదేవీల గురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు.. సక్సెస్ కాని ట్రాన్సాక్షన్స్ సెటిల్మెంట్ చేయటంలో ఆలస్యం జరిగితే బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేసుకునే హక్కు రిజర్వు బ్యాంక్ ప్రజలకు కల్పించింది.