ఈరోజుల్లో జాబ్ చేస్తున్న చాలా మంది వద్ద ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. మెరుగైన రివార్డులు, క్యాష్ బ్యాక్స్, ఓచర్స్ లాంటి ప్రయోజనాలు ఇచ్చే కార్డును ఉపయోగిస్తూ.. మిగిలిన వాటిని ఏమాత్రం వాడకుండా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు తమకు నచ్చక వాటిని క్లోజ్ చేస్తారు. అయితే చాలా కాలంగా ఉపయోగించకుండా వదిలేసిన క్రెడిట్ కార్డుల విషయంలో అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టాలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి..
క్రెడిట్ కార్డును వాడనంత మాత్రాన సిబిల్ స్కోరు ఏం పడిపోదు. కానీ ఇది పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాలం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని కార్డులను బ్యాంకులు గుర్తించి, ముందస్తు సమాచారంతో లేదా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆటోమేటిక్‌గా వాటిని క్లోజ్ చేస్తుంటాయి. ఇలా కార్డ్ రద్దయితే అది మీ క్రెడిట్ స్కోర్‌ను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది.
ప్రధానంగా ఇది 2 విధాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. ఉదాహరణకు.. మీ వద్ద రెండు కార్డులు ఉండి ఒక్కోదానిపై రూ.లక్ష లిమిట్ ఉందనుకుందాం. ఒక కార్డును పూర్తిగా పక్కన పెట్టి.. మరోదానిపైనే అన్ని ఖర్చులు పెడితే మీ వినియోగ నిష్పత్తి ఎక్కువైపోతుంది. కార్డు లిమిట్లో 30 శాతానికి మించి ఖర్చు చేస్తే.. అది మీ సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదే మీరు రెండు కార్డులను ఉపయోగిస్తే ఈ భారం సగానికి తగ్గుతుంది. ఖర్చు చేసే డబ్బు వేరు వేరు కార్డుల యూసేజ్ లిమిట్స్ కిందకు వెళుతుంది కాబట్టి అది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపలేదు.
ALSO READ : SBI బ్యాంక్‌కు సైబర్ దెబ్బ: 3.75 లక్షల మంది డేటా లీక్ చేసిన హ్యాకర్లు!
రెండవది క్రెడిట్ హిస్టరీ. మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో ఇది సుమారు 15 శాతం పాత్ర పోషిస్తుంది. మీరు పక్కన పెట్టి, బ్యాంక్ క్లోజ్ చేసిన కార్డు మీ దగ్గర ఉన్న వాటిలో పాతదైతే.. మీ క్రెడిట్ హిస్టరీ ఆయువు తగ్గిపోయి స్కోరు భారీగా పడిపోతుంది.
ఏం చేస్తే మంచిది?
అధిక యాన్యువల్ ఫీజులు ఉండి అసలు వాడని కార్డులను క్లోజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. లేదంటే.. ఆ కార్డును పూర్తిగా వదిలేయకుండా చిన్న చిన్న ఖర్చులైన కరెంట్ బిల్లులు, మొబైల్ రీచార్జ్‌లు, పెట్రోల్ పేమెంట్స్ లాంటి వాటికి అప్పుడప్పుడు వాడి గడువులోగా బిల్లు చెల్లించాలి. దీనివల్ల కార్డు యాక్టివ్‌గా ఉండటమే కాకుండా క్రెడిట్ స్కోరుపై ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు.
